ఫెడరల్ ఫ్రంటా? బీజేపీయేతర కూటమా?

Share

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ స్థాయి రాజకీయాలలో తమదైన స్టైల్ లో చక్రం తిప్పేందుకు పన్నుతున్న వ్యూహాలు, వేస్తున్న ఎత్తుగడలు కాంగ్రెసేతర, బీజేపీ యేతర పార్టీలను కన్ఫ్యూజన్ లో పెట్టేస్తున్నాయి. ఎందుకంటే ఏపీ సీఎం చంద్రబాబుకు రాజకీయ అనుభవం, జాతీయ రాజకీయాలలో కూటముల ఏర్పాటులో చాకచక్యం కారణంగా ఆయన ప్రతిపాదిస్తున్న బీజేపీయేతర కూటమి పట్ల మొగ్గు చూపాలా…తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఒకేసారి అటు బీజేపీయేతర ఫ్రంట్ తోనూ, ఇటు బీజేపీతోనూ విభేదించి ఒంటరిగానే ఘన విజయాన్ని అందుకున్న  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ వైపునకు రావాలా అన్న సందిగ్ధతలో జాతీయ స్థాయిలో పార్టీలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే…ఫెడరల్ ఫ్రంట్ యత్నాలను ముమ్మరం చేసేందుకు కేసీఆర్ ఇటీవల ఓడిశా, పశ్చిమ బెంగాల్, హస్తినలలో పర్యటించి వచ్చారు. ఆయన పర్యటన పూర్తి చేసుకుని హైదరాబాద్ కు తిరిగి వచ్చిన తరువాత కూడా ఫెడరల్ ఫ్రంట్ లో పురోగతికి సంబంధించి ఎటువంటి కదలికా కనిపించలేదు. అదే సమయంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీ యేతర కూటమి విషయంలో కూడా ఎటువంటి పురోగతీ కనిపించడం లేదు. కేసీఆర్ తన పర్యటనలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఫెడరల్ ఫ్రంట్ పై మరింత విస్తృతంగా చర్చిస్తామని మాత్రమే సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో చెప్పారు. ఇక హస్తిన పర్యటనలో కేసీఆర్ ముందుగా ప్రకటించిన విధంగా ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ ను కానీ, బీఎస్పీ అధినేత్రి మాయావతిని కానీ కలవలేదు. ఇందుకు కారణాలు స్పష్టంగా తెలియవు. కానీ ఫెడరల్ ఫ్రంట్ విషయంలో పార్టీలు ముందు వెనుకలాడుతున్నందుకే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. బీజేపీయేతర కూటమి విషయంలో కానీ, ఫెడరల్ ఫ్రంట్ విషయంలో కానీ పార్టీలు ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నాయన్నది పరిశీలకుల అంచనా. ఏ గట్టునుండాలో తెల్చుకోవడానికి మరి కొంత సమయం వేచి చూద్దామన్న భావనే పార్టీలలో కనిపిస్తున్నది.

ముఖ్యంగా మాయావతి విషయం తీసుకుంటే మధ్య ప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరిగా బరిలోనికి దిగిన బీఎస్పీ, ఎంపీలో కాంగ్రెస్ అధికారం చేపట్టడానికి కావలసిన మద్దతును బేషరతుగా ప్రకటించారు. అలాగే సార్వత్రిక ఎన్నికలలో కూడా బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే బలం ఉన్న పార్టీకే ఆమె మద్దుతు ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ఎస్పీ విషయానికి వస్తే ఉత్తర ప్రదేశ్ లో బీజేపీని దీటుగా ఎదుర్కొనాలంటే ఎస్పీతో కలిసినడవక తప్పదని ఆయన భావిస్తున్నారు. అందు వల్ల కూటమి విషయంలో ఆ రెండు పార్టీల నిర్ణయం ఒక్కటే అయి ఉండేందుకే ఎక్కువ అవకాశాలున్నాయి. ఇక బిజూజనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్ ల విషయానికి వస్తే ఆ రెండూ కూడా ముందు కాంగ్రెసేతన, బీజేపీయేతర కూటమికే మొగ్గు చూపుతాయి. అయితే ఇటీవలి పరిస్థితులలో బీజేపీకి వ్యతిరేకంగా అవసరమైతే కాంగ్రెస్ తో కూడిన ఫ్రంట్ లో భాగస్వామి కావడానికి కూడా తనకు అభ్యంతరం లేదన్నట్లుగా మమతా బెనర్జీ సంకేతాలిస్తున్నారు. కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటవ్వడంలో ఆమె చొరవ అత్యంత ప్రధాన భూమిక పోషించిందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంటా, చంద్రబాబు ప్రయత్నాలు సాగిస్తున్న బీజేపీయేతర కూటమా? ఎందులో చేరాలన్న విషయంలో ఆయా పార్టీలు వేచి చూచే ధోరణిని అవలంబిస్తున్నాయని చెప్పాల్సి ఉంటుంది.


Share

Related posts

ద్వివేదికి ఈసి అవార్డు

somaraju sharma

నరుక్కో.. అమ్ముకో నా రాజా!! ఎర్ర చందనం తలుపులు బార్లా

Special Bureau

Voter ID: సింపుల్ గా ఓటర్ కార్డు లో అడ్రస్ మార్చుకోండిలా..!!

bharani jella

Leave a Comment