Colgate: మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా?? అని అడిగిన కంపెనీకి… మీ టూత్ పేస్ట్ లో మోసం ఉంది అంటున్న న్యాయవాది.

Colgate : సాధారణంగా ఎప్పుడైనా షాపుకు వెళితే ఒక  వస్తువుని కొన్నాక షాపు అతను ఎంత చెపితే అన్ని డబ్బులు ఇచ్చేస్తాం. కానీ చాలా అరుదుగా కొందరు మాత్రం MRP ఎంత ఉంది? వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు అని అన్నీ ఆరా తీసి మరీ డబ్బులు ఇస్తుంటారు. ఇటీవల ఒక వ్యక్తి తాను కొనుగోలు చేసిన వస్తువులను కాస్త సూక్ష్మంగా చెక్ చెయ్యగా ఒక బడా కంపెనీ చేస్తున్న మోసం వెలుగులోకి వచ్చింది. టూత్ పేస్ట్ లోని ప్రముఖ బ్రాండ్ కోల్గేట్ ఉత్పత్తి చేస్తున్న కోల్గేట్ – Colgate మాక్స్ వెనుక ఉన్న మోసం ని బయట పెట్టారు ఒక న్యాయవాది. అంతేకాకుండా మీరు తప్పు చేస్తున్నారు అంటూ ఆయన అన్నప్పుడు వారు ఎలాంటి రిప్లై ఇవ్వకపోవటంతో చివరికి ఈ విషయం కోర్టు ఫైన్ వేసే వరకు వెళ్లింది.

Sangareddy consumers court imposed fine to Colgate
Sangareddy consumers court imposed fine to Colgate

నాగేందర్ ఒక న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఈయన గత సంవత్సరం ఏప్రిల్ లో సంగారెడ్డి జిల్లా లోని ఒక ప్రముఖ మాల్ లో 150 గ్రాముల కాల్గేట్ మాక్స్ టూత్ పేస్ట్ రూ.92కు కొనుగోలు చెయ్యగా దీంతో పాటుగా  20 గ్రాముల కోల్గోట్ మాక్స్ ఖరీదు రూ.10 అని తెలుసుకున్నారు. ఆయన వెంటనే పది రూపాయిలకు 20 గ్రాముల పేస్టే వస్తున్నప్పుడు మరి 150 గ్రాములకు రూ.92 తీసుకోవటం ఏమిటి అని ఆలోచన చేశారు. లెక్క ప్రకారం చూస్తే దాని ఖరీదు రూ.75కు మించి ఉండకూడదు. అయితే ఆయన ఇదే లెక్కను వివరంగా చెప్పి రూ.17 ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారు అని ప్రశ్నిస్తూ కోల్గోట్ సంస్థకు నోటీసులు జారీచేశారు.

నోటీసులు పంపించినప్పటికీ సంస్థ నుంచి ఎటువంటి సమాధానం రాకపోవటంతో ఆయన సంగారెడ్డి వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. అయితే ఫోరం, ఈ వినియోగదారుడ్ని మానసికంగా క్షోభకు గురి చేసినందుకు గాను రూ.10వేలు అలాగే అదనంగా ఖర్చులకు గాను రూ.5వేలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.50వేలు చెల్లించాలని కోల్గోట్ సంస్థను ఆదేశించారు. చివరికి ఫోరం విధించిన మొత్తం సొమ్ముని బాధితుడికి నెల రోజుల్లోగా చెల్లించాలన్నారు.