Ponnala:తెలంగాణలో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ టికెట్ ల పంచాయతీ తారా స్థాయికి చేరుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఏర్పడటంతో టికెట్ లపై నియోజకవర్గాల్లో పోటీ నెలకొంది. వేరువేరు పార్టీల నుండి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తూ పార్టీలో ఎప్పటి నుండో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఒక పక్క, బీసీ నేతలకు అవకాశం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా బీసీ వాదాన్ని ప్రస్తావిస్తూ టికెట్లు అమ్ముకుంటున్నారంటూ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కొందరు బీసీ నేతలు ఇటీవల గాంధీ భవన్ వద్ద ధర్నాకు సిద్దమవ్వగా, పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కు తగ్గారు.
ఈ పరిణామాల క్రమంలోనే సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేశారు. అభ్యర్ధుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. పార్టీ అంశాలు చర్చించేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. పార్టీలో చోటు చేసుకుంటున్న వ్యాపార రాజకీయాలతో తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పరువు పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. కొందరు నేతల వైఖరితో పార్టీ పరువు మట్టిలో కలుస్తొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలు చేయడం లేదనీ, అవమానాలు ఎదుర్కొని పార్టీలో ఉండలేనని అన్నారు. సీనియర్ లకు కూడా అధిష్టానం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ వీడటానికి దారి తీసిన కారణాలను వివరించే క్రమంలో ఆయన భావోద్వేగానికి గురైయ్యారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 12 ఏళ్ల పైచిలుకు మంత్రిగా వివిధ శాఖలు నిర్వహించిన తనకే అవమానాలు, అవహేళనలు చవి చూశానన్నారు. పదవుల కోసం తాను రాజీనామా చేయలేదని పేర్కొన్న ఆయన భవిష్యత్తు గురించి ఎవరెవరు ఏదో ఊహించుకుంటే దానిపై తాను స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. జనగామలో పోటీ, తన రాజకీయ భవిష్యత్తుపై ఏమి మాట్లాడదల్చుకోలేదని చెప్పారు. తన నియోజకవర్గం జనగామ నియోజకవర్గం నుండి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి టికెట్ ఆశిస్తుండగా, టికెట్ వచ్చే చాన్స్ లేదన్న కారణంగా పొన్నాల రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది.
అయితే పొన్నాల రాజీనామాపై ఎవరూ వ్యతిరేకంగా కామెంట్స్ చేయవద్దని పార్టీ నేతలకు అధిష్టానం నుండి సమాచారం అందినట్లుగా ప్రచారం జరుగుతోంది. మరో పక్క పొన్నాల వస్తానంటే తాను స్వయంగా ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తానని బీఆర్ఎస్ నేత, మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుంటోందని ఆయన ఆరోపించారు. కూకట్ పల్లి అసెంబ్లీ సీటుకు రూ.15 కోట్లు అడిగారని ఓ కాంగ్రెస్ పార్టీ నేతే చెప్పారన్నారు.