పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ (79) కన్నుమూశారు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ దుబాయ్ లోని ఓ ప్రముఖ అనుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ముషారఫ్ కుటుంబ సభ్యులు దృవీకరించినట్లు ఆ దేశ మీడియా సంస్థలు వెల్లడించాయి.

ఆయన 1943 ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించారు. ఆయన బాల్యంలో కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్ లో చదివారు. ఆ తర్వాత లాహోర్ లోని ఫోర్మన్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత చదువులు చదివారు. ఆ తర్వాత బ్రిటన్ లోని రాయల్ కాలేజీ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ లో చదివారు. 1961 లో పాకిస్థాన్ మిలిటరీ అకాడమీ లో చేరారు. పాకిస్థాన్ ఆర్మీలో 1964లో చేరారు. జనరల్ పర్వేజ్ ముషారఫ్ 1998 నుండి 2007 వరకూ పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. 1998 నుండి 2001 వరకు చైర్మన్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీగా వ్యవహరించారు. 1999 లో ఫెడరల్ ప్రభుత్వాన్ని సైన్యం కూల్చేసింది. ముషారఫ్ 2001 జూన్ 20 నుండి 2008 ఆగస్టు 18 వరకూ పాకిస్థాన్ దేశాధ్యక్షుడుగా పని చేశారు. అప్పట్లో ఆయనపై దేశ ద్రోహం అభియోగాలు నమోదు అయ్యాయి. రాజ్యాంగాన్ని రద్దు చేసి సైనిక పాలన విధించి తీవ్ర దేశ ద్రోహానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో 2019 లో పాకిస్థాన్ ప్రత్యేక కోర్టు మరణ శిక్ష విధించింది.
1999 లో తిరుగుబాటు ద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకొని, అధ్యక్షుడి స్థానాన్ని చేజిక్కించుకొని, నిరంకుశంగా పరిపాలించిన ముషారఫ్ దేశ ద్రోహి నేరానికి పాల్పడ్డారని కోర్టు అభిప్రాయపడింది. కానీ తర్వాత 2020 లో అతని మరణ శిక్షను లాహోర్ హైకోర్టు నిలిపివేస్తూ తీర్పు ఇచ్చింది. గత 2018 నుండి ముషారఫ్ ప్రాణాంతక వ్యాధి అమిలోయిజోసిన్ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే దుబాయ్ లోని అమెరికన్ హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్నారు. 2016 నుండి ఆయన దుబాయ్ లోనే ఉంటున్నారు. గత జూన్ లోనే అతని కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. మాజీ ఆర్మీ చీఫ్ కోలుకోవడం సాధ్యం కావడం లేదనీ, అతని అవయవాలు పని చేయని దశలో ఉన్నాయని పేర్కొన్నారు. అనారోగ్యం కారణంగా మూడు వారాల క్రితం అసుపత్రిలో చేర్చామని, త్వరగా కోలుకోవాలని ప్రార్ధించాలని తెలిపారు. అయితే సుదీర్ఘ కాలంలో అసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు.