రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్ధులు మృతి

గుంటూరు, డిసెంబర్ 31 : మితిమీరిన వేగం నలుగురు విద్యార్థుల ప్రాణాలు తీసింది. జాతీయ రహదారిపై గుంటూరు, లాలుపురం దగ్గర సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూర్ ఆర్.వి.ఆర్ ఇంఏజినీరింగ్ కాలేజికి చెందిన ఏడుగురు విద్యార్ధులు నూతన సంవత్సరం వేడుకల కోసం కారులో విజయవాడ బయలుదేరారు. అతి వేగంగా వెళుతున్న కారు లాలుపురం వద్ద రోడ్డు డివైడర్‌ను ఢీ కొట్టింది.  ఆవెంటనే వెనుక వస్తున్న మున్సిపల్ లారీని కూడా ఢీకొన్నది. కారు ఎంత వేగంలో ఉన్నదంటే అది ఢీకొన్న ధాటికి లారీ కూడా బోల్తా కొట్టింది. సుమారు 160 కిలోమీటర్ల వేగంలో కారు ప్రమాదానికి గురయింది. కారులోని మిగతా ముగ్గురు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన విద్యార్ధులను ధనుష్ (గుంటూరు, విద్యానగర్), సాయిరామ్(పెదకూరపాడు మండలం, కమ్మంపాడు), కోటేశ్వరరావు (శావల్యపురం), కపూర్‌గా గుర్తించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ డ్రయివర్, క్లీనర్ కూడా గాయపడ్డారు.