ఉచిత పంపిణీలు అంటే ఎక్కడైనా ఎగబడటం పరిపాటిగా మారింది. క్రమ పద్దతి పాటించడం, క్రమశిక్షణగా నడుచుకోవడం చేయరు. ఆ ఉచిత వస్తువు అందుకోవాలన్న ఆరాటంలో అపస్తృతులు చోటుచేసుకోవడం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. గత నెలలో గుంటూరులో చీరల పంపిణీ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమంలో తొక్కిసలాట జరగడంతో ముగ్గురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయ్యింది. అటువంటి ఘటనే తమిళనాడులోనూ జరిగింది. అక్కడి ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందగా, మరో డజను మంది గాయపడ్డారు.

తిరుపత్తూరు జిల్లా వానియంబాడి సమీపంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. అయ్యప్పన్ బ్లూమెటల్ సంస్థ నిర్వహకుడు అయ్యప్పన్ గత కొన్ని సంవత్సరాలుగా తైపూస ఉత్సవాల సందర్భంగా ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ ఆనవాయితీ మేరకు ఆదివారం వేడుక నేపథ్యంలో శనివారం ఉచిత చీరెల పంపిణీకి టోకెన్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. టోకెన్లు తీసుకునేందుకు సుమారు రెండు వేల మంది తరలివచ్చారు. సంస్థ తలుపులు తెరిచిన వెంటనే పెద్ద ఎత్తున మహిళలు లోపలకు ప్రవేశించే ప్రయత్నం చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 16 మంది మహిళలు స్పృహతప్పి పడిపోయారు. వీరందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కరుంబట్టి ప్రాంతానికి చెందిన వళ్లియమ్మాళ్ (60), ఉచ్చంబట్టుకు చెందిన నాగమ్మాళ్ (60), అరపాండై కుప్పం వాసి రాజాత్తి (60), వానియంబాడికి చెందిన మల్లిక (65) మృతి చెందారు. మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిర్వహకుడు అయ్యప్పన్ ను అరెస్టు చేశారు. గుంటూరులోనూ చీరల పంపిణీ చేసిన స్వచ్చంద సంస్థ నిర్వహకుడు, ఎన్ఆర్ఐపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇక్కడ తమిళనాడులోనూ నిర్వహకుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇటువంటి తరహా దుర్ఘటనలు పునరావృత్తం కాకుండా ఉండాలంటే ఉచిత వస్తువులు పంపిణీలు చేసే నిర్వహకులు సరైన జాగ్రత్తలు తీసుకోవడంతో పుట పోలీస్ పర్మిషన్, బందోబస్తు లాంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి దుర్ఘటనల వల్ల పేద ప్రజలకు ఏదో విధంగా వారికి చేతనైనంత సాయం చేయాలని ముందుకు వచ్చే వారు వెనుకాడే పరిస్థితులు ఏర్పడతాయి. ప్రజలు కూడా సంయమనం పాటించడం అలవర్చుకోవాలి.
సుప్రీం కోర్టు రిజిస్ట్రార్‌కు ఏపీ సర్కార్ కీలక లేఖ