బ్యాలెట్‌లో గుర్తుల మార్పు.. ఓల్డ్ మలక్‌పేట పోలింగ్ రద్దు

 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని ఓల్డు మలక్‌పేట డివిజన్ (26)లో పోలింగ్ రద్దు అయ్యింది. ఈ డివిజన్ బ్యాలెట్ పేపరులో ఒక గుర్తుకు బదులు మరో గుర్తును కేటాయించడంపై సీపీఐ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డివిజన్ పరిధిలోని పోలింగ్ నిలిపివేయాలని సీపీఐ డిమాండ్ చేసింది.

ఈ డివిజన్‌లో సీపీఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఫాతిమాకు ఎన్నికల గుర్తు కంకి కొడవలికి బదులుగా సుత్తి కొడవలి గుర్తు కేటాయించారు. దీంతో వెంటనే పోలింగ్ నిలిపివేసి మళ్లీ సరైన బ్యాలెట్ పేపరును ముద్రించాలని సీపీఐ నేతలు కోరారు. ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. వెంటనే ఓల్డు మలక్‌పేట డివిజన్ పోలింగ్ నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీఐ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం ఆ డివిజన్‌లో పోలింగ్ ను రద్దు చేసింది.

బ్యాలెట్ పేపరుపై సీపీఐ ఎన్నికలకు గుర్తు బదులు సీపీఎం ఎన్నికల గుర్తు ఉండటాన్ని ఎన్నికల అధికారులు గుర్తించారు. దీంతో ఓల్డు మలక్‌పేట లో 1,2,3,4,5 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ను నిలిపివేశారు. ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పోలింగ్ ను ఈ నెల 3వ తేదీన నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది.