ఆడపిల్ల అయితే అమ్మకం..! ట్విస్టులున్న ఓ కన్నీటి కథ..!!

 

ఓ మహిళ తమకు పుట్టేది ఆడపిల్లేనని అనుమానంతో ఆ బిడ్డను అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇది జరిగిన ఐదు నెలలకు గాను తమకు పుట్టింది మగ పిల్లవాడని మధ్యవర్తి మోసం చేసిందని తెలుసుకొని తన బిడ్డ తమకి కావాలని నాచారం పోలీసులను ఆశ్రయించింది.

హైదరాబాద్, పటాన్ చెరువు పరిధి వెలమల గ్రామానికి చెందిన కనిరాసి వెంకటేష్ మీనా దంపతులు నాచారం లో ఉంటారు. అతను డ్రైవర్ గా, ఆమె ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మీనాకు మొదటిసారి ఓ ఆడపిల్ల పుట్టి చనిపోయింది. తరువాత మరో పాపకి జన్మించింది. గత సంవత్సరం మీనా మూడో సారి గర్భం దాల్చింది. ఆర్థిక ఇబ్బందులు, వరుసగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో ఈసారి పుట్టబోయే బిడ్డ కూడా ఆడపిల్లేనన్న అనుమానంతో తమ వద్ద కాకుండా ఎక్కడైనా చక్కగా ఉంటుందన్న ఆలోచనతో గర్భంలో ఉండగానే అమ్మేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. పారిశుద్ధ్య కార్మికురాలు జానకి విషయం చెప్పారు. జిహెచ్ఎంసి సూపర్ వైజర్ రాజేష్ కి పిల్లలు లేరని, బిడ్డనిస్తే ఆస్పత్రి ఖర్చులతో పాటు కొంత డబ్బు ఇస్తానని చెప్పడంతో అంగీకరించారు. మీనాకు జూన్ 19న మగ శిశువుకు జన్మించింది. పాప పుట్టిందని గుండెలో రంధ్రం ఉండటంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేర్పించారని మూడు లక్షల ఖర్చు అవుతుందని జానకి చెప్పింది. మగబిడ్డను రాజేష్ దంపతులకు అప్పగించింది. దఫాలుగా మీనాకు లక్ష ఇచ్చింది. తనకు మగ బిడ్డ పుట్టిన విషయం ఇటీవలే తెలియడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. కావాలని మధ్యవర్తి మోసం చేసిందని, తమ బిడ్డ తమకు కావాలంటూ నాచారం పోలీసులను ఆశ్రయించారు. నాచారం సీఐ కిరణ్ కుమార్ విచారణ జరిపారు, శిశువును అక్రమంగా అమ్మడం, కొనడం నేరమే. దీంతో శిశువును అమ్మిన, కొన్న తల్లిదండ్రుల పై కేసు నమోదు చేశారు. శిశువు బాధ్యతను శిశు విహార్ కు అప్పగించారు.