షెల్టర్ హోంలలో బాలికలకు భద్రత ఎక్కడ?

బాలికల భద్రత కోసం ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న షెల్టర్ హోంలు వారి పాలిట నరక కూపాలుగా మారుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని ఒక షెల్టర్ హోంలోని బాలికలపై అక్కడి సిబ్బందే దౌర్జన్యానికి పాల్పడిన సంఘటన వెలుగులోనికి వచ్చింది. ఆ షెల్టర్ హోంలో సిబ్బంది పెట్టే బాధలకు ఆరు నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్కులైన బాలికలు నరకయాతన అనుభవిస్తున్నారు.   ఢిల్లీ మహిళా కమిషన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా షెల్టర్ హోం ను సందర్శించిన మహిళా కమిషన్ సభ్యులు అక్కడ జరుగుతున్న అరాచకాలను గమనించి తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

గదులను ఊడవడం, వారి బట్టలు ఉతకడం, వంట చేయడం తదితర పనులను సిబ్బంది తమతో చేయిస్తున్నారని, ఒకవేళ వినకపోతే తమ మర్మావయవాలలో కారంపెట్టి హింసిస్తున్నారనీ షెల్టర్ హోంలో ఆశ్రయం పొందుతున్న బాలికలు మహిళా కమిషన్ సభ్యులకు తెలిపారు.    షెల్టర్‌ హోంలో బాలికల సంరక్షణ కోసం   డిసిడబ్ల్యు కౌన్సెలర్లను, పోలీసులను నియమించారు.  కాగా బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఒక షెల్టర్‌ హోంలో బాలికలపై అత్యాచారాలు జరిగిన విషయం  దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఉదంతం మరువక ముందే  ఇప్పుడు ఢిల్లీలోని ఓ బాలికల షెల్టర్ హోంలో మరో దారుణం వెలుగు చూసింది. దీంతో  షెల్టర్ హోంలలో బాలికల భద్రత పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతున్నది.