ఈయన గోవా సీఎం మనోహర్ పారికర్

పేంక్రియాస్ కు క్యాన్సర్ సోకి తీవ్ర అస్వస్థతకు గురైన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చాలా కాలం తరువాత ఈ రోజు సెక్రటేరియెట్ కు వచ్చారు. బాగా నీరసించిపోయి కనిపించారు.

పాంక్రియాటిక్‌ కేన్సర్‌తో బాధపడుతున్న పారికర్‌ గత చాలాకాలంగా అధికారిక విధులకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయన తీవ్ర అస్వస్థతతో పాలనా విధులకు దూరంగా ఉండటంలో గోవాలో పరిపాలన స్థంభించిందంటూ విపక్ష నేతలు  విమర్శలు గుప్పించిన సంగతి కూడా తెలిసిందే. కేంద్ర మంత్రిగా ఉన్న పారికర్ ను ప్రధాని నరేంద్రమోడీ ఏరి కోరి గోవా ముఖ్యమంత్రిగా పంపించారు.

జనంతో  మమేకమై వారిలో ఒకరిగా, వారి తలలో నాలుకలా వ్యవహరించే పారికర్ కు గోవాలో బీజేపీ శ్రేణుల్లోనే కాకుండా విపక్ష కార్యకర్తలలో కూడా అభిమానులు ఉన్నారు. దర్జాగా సిగరెట్ కాలుస్తూ, రోడ్డు పక్క టీ బడ్డీలో టీ తాగుతూ ప్రజలతో ముచ్చటించడానికి ఆయన ఎక్కువ ఇష్టపడేవారు. కేంద్ర మంత్రి హోదాలో గోవా పర్యటనల సమయంలో కూడా ఆయన ప్రొటోకాల్ వంటి విషయాలను పక్కన పెట్టి జనంతో కలిసి పోయేవారు. అటువంటి నేత ఈ రోజు సెక్రటేరియెట్ కు వచ్చిన సందర్భంగా చూసిన వారు దిగ్భ్రాంతి చెందారు. మనిషి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. సన్నగా చీపురుపుల్లలా ఉన్న మనోహర్ ను సహాయకులు పట్టుకుని నడిపించడం కనిపించింది. ముక్కుల్లో రైల్స్ ట్యూబ్ తో అడుగులో అడుగేసుకుంటూ నడుస్తున్న మనోహర్ పారికర్, అంత అస్వస్థతలోనూ సెక్రటేరియెట్ లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు.