కేసీఆర్‌, జ‌గ‌న్… ఓ తీపిక‌బురు

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌ధ్య ఉన్న సఖ్య‌త గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

ఇరు రాష్ట్రాల ప్ర‌యోజ‌నాల కోణంలో కావ‌చ్చు. రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల్లో భాగం కావ‌చ్చు కానీ ఈ ఇద్ద‌రు నేత‌ల దోస్తీ కొన‌సాగుతోంది. అయితే, తాజాగా ఒకే రోజు ఒకే అంశంలో ఈ ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు కీల‌క నిర్ణ‌యాలు వెల్ల‌డించారు. అదే మందుబాబుల‌కు సంబంధించిన నిరీక్ష‌ణకు తెర దించ‌డం.

కేసీఆర్ నిర్ణ‌యం ఇది

తెలంగాణ‌లోని మందుబాబుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ అందించారు. కరోనా వ్యాప్తి కారణంగా తెలంగాణలోని బార్లు, క్లబ్ లను మూసివేయాల‌ని ప్ర‌భుత్వం ఆరు నెల‌ల క్రితం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో బార్లు, క్ల‌బ్ లు తెరుచుకోనున్నాయి. దీనికి సంబంధించి ప్ర‌భుత్వం శుక్రవారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే ప‌ర్మిట్ రూమ్‌ల‌కు మాత్రం అనుమ‌తి ఇవ్వ‌లేదు. బార్లు, క్ల‌బ్బుల్లో మ్యూజిక‌ల్ ఈవెంట్స్, డ్యాన్స్‌ల‌ను నిషేధించింది. క‌రోనా నిబంధ‌న‌లు క‌చ్చితంగా పాటించాల‌ని… నిబంధ‌న‌లు పాటించ‌ని బార్లు, క్ల‌బ్ ల‌పై కఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది.

బారుకెళ్తున్నారా….ఇవ్వ‌న్నీ తెలుసుకోండి

మ‌రోవైపు, బార్లు తెరిచే స‌మ‌యంలో ప‌లు నిబంధ‌న‌లు పాటించాల్సిందేన‌ని తేల్చిచెప్పింది. బార్లు, క్ల‌బ్ ల దగ్గర థ‌ర్మ‌ల్ స్ర్కీనింగ్‌లు ఏర్పాటు చేయాలని స్ప‌ష్టం చేసింది క్ర‌మ‌ప‌ద్ధ‌తి పాటించాలని, ప‌రిశుభ్ర‌త‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాల‌ని ఆదేశించింది తెలంగాణ ప్ర‌భుత్వం. ప్ర‌తి రోజు ఉద‌యం, సాయంత్రంతో బార్లలో సీట్లను శానిటైజ్ చేయాలని స్ప‌ష్టం చేసింది. వెంటిలేష‌న్ ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపింది. శానిటైజ‌ర్ త‌ప్ప‌నిస‌రిగా అందుబాటులో ఉంచాలని సూచించింది. బార్లు, క్ల‌బ్ సిబ్బందితో పాటు మిగ‌తా వారు క‌చ్చితంగా మాస్కు ధ‌రించాలని ప్ర‌భుత్వ ఆదేశాలు వెల్ల‌డించారు. పార్కింగ్ ఏరియాల్లో జ‌నాలు గుమిగూడ‌కుండా చూడాలని తెలిపింది. అయితే, బార్ల‌లో మ్యూజిక‌ల్ ఈవెంట్స్, డ్యాన్స్‌ల‌పై నిషేధం విధించింది.

 

జ‌గ‌న్ స‌ర్కారు ఏం చెప్పిందంటే….

మ‌రోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సైతం కీల‌క నిర్ణ‌యం వెలువ‌రించింది. రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానుంది. ప్రస్తుతమున్న 2,934 మద్యం దుకాణాలు మరో ఏడాది పొడిగింపు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ప్రతి ఏడాది 20 శాతం మేర మద్యం దుకాణాలు తగ్గించాలని గతంలో నిర్ణయం తీసుకున్న మేర‌కు మద్యం దుకాణాల తగ్గింపుపై కొత్త పాలసిలో ప్రభుత్వం ప్రస్తావించింది. ఇప్ప‌టికే, లాక్ డౌన్ తర్వాత 13 శాతం మద్యం దుకాణాలు ప్రభుత్వం తగ్గించింది. ఎక్సైజ్ శాఖ కమిషనర్ అనుమతితో లిక్కర్ మాల్స్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన 2,934 దుకాణాల పరిధికి లోబడే లిక్కర్ మాల్స్ ప్రారంభం కానున్నాయి.

తిరుమ‌ల‌లో మందుపై కీల‌క నిర్ణ‌యం

మ‌రోవైపు గ‌త కొద్దిరోజులు‌గా విప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు ప్ర‌భుత్వం చెక్ పెట్టింది. తిరుమ‌ల‌లో మ‌ద్యం అమ్మ‌కాలు అందుబాటులోకి తెచ్చే ప్ర‌స్త‌కే లేద‌ని తేల్చిచెప్పింది. తిరుపతి రైల్వే స్టేషన్-అలిపిరి మార్గంలో లిక్కర్ షాపులకు అనుమతి నిరాకరించింది. తిరుపతి బస్టాండ్ ,లీలామహాల్ సెంటర్ ,నంది సర్కిల్ ,విష్ణు నివాసం, శ్రీనివాసం వంటి ప్రాంతాల్లో లిక్కర్ అమ్మకాలపై నిషేధం విధించింది ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం.