సాఫ్ట్వేర్ సంస్థ గూగుల్ కొట్టిన దెబ్బకు చైనాకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న పలు చైనా యాప్‌లను వినియోగదారుల డేటాను తస్కరిస్తున్నాయని చెప్పి గూగుల్ తొలగించింది. అది మాత్రమే కాక.. ఇప్పుడు తాజాగా.. గూగుల్ తన యూట్యూబ్ ప్లాట్‌ఫాం నుంచి పెద్ద ఎత్తున చైనాకు చెందిన చానళ్లను తొలగిస్తున్నట్లు తెలిపింది. మొత్తం 2500 వరకు యూట్యూబ్ చానళ్లను గూగుల్ తొలగించింది. ఈ మేరకు గూగుల్ ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించింది.
గూగుల్ తొలగించిన ఆ 2500 యూట్యూబ్ చానల్స్‌కు చైనాతో సంబంధాలు ఉన్నాయి. అలాగే ఆయా చానళ్లలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. అందువల్లే వాటిని తొలగించామని గూగుల్ తెలియజేసింది. ఏప్రిల్ నుంచి జూన్ నెలల మధ్య కాలంలో ఆయా చానల్స్‌ను తొలగించినట్లు తెలిపింది. ఎప్పటికప్పుడు తమ ప్లాట్‌ఫాంలపై ఇలాంటి చానళ్లు, యాప్‌లను తొలగిస్తున్నామని గూగుల్ వెల్లడించింది.
కాగా ఈ విషయంపై అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ఇంకా స్పందించలేదు. అయితే ఇప్పటికే ప్రపంచ దేశాలు చైనాకు చెందిన యాప్స్‌పై సమీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో గూగుల్ అలాంటి యాప్స్‌ను, యూట్యూబ్ చానల్స్ ను తొలగిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ బాటలో ఇప్పటికే టిక్‌టాక్, విచాట్ యాప్‌లను నిషేధిస్తామని ప్రకటించడం చైనాను కలవరపెడుతోంది. ప్లే స్టోర్‌లో ఉన్న చాలా వరకు యాప్స్‌లో చైనావే ఉన్నాయని, అవి యూజర్ల డేటాను తస్కరిస్తున్నాయనే కారణాలతో గతంలో గూగుల్ పలు యాప్స్‌ను తొలగించింది. ఈ క్రమంలో ఇప్పుడు యూట్యూబ్ ప్లాట్‌ఫాంను సమీక్షిస్తున్నామని, తప్పుడు వార్తలను ప్రసారం చేసే చానళ్లపై వేటు వేస్తున్నామని గూగుల్ తెలిపింది. అయితే ఆ చానల్స్‌లో ఎక్కువగా చైనావే ఉండడం కలకలం రేపుతోంది.