యూపీలో గో సంక్షేమ పన్ను

యూపీలో సామాన్యుల భద్రత గురించి ఎవరెంత మొత్తుకున్నా, గో రక్షణ పేరిట జరుగుతున్న దాడుల గురించి ఎంత గగ్గోలు పెట్టినా ఆ రాష్ట్ర సర్కార్ కు కనీసం చీమకుట్టినట్టైనా ఉండదనిపిస్తున్నది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తాను తలచినదే చేస్తుంది. విపక్షాల విమర్శలు, ప్రజల అభ్యంతరాలను ఇసుమంతైనా పట్టించుకోదు. గో సంరక్షణ కన్నా మనుషుల రక్షణకు పెద్ద పీట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని కోర్టులు అక్షింతలు వేసినా యూపీసీఎంకు ఖాతరు లేనట్లుగా కనిపిస్తున్నది. తాజాగా యూపీ సర్కార్ గో సంక్షేమ సెన్ ను ప్రజలపై వేస్తున్నది.

ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం గో సంక్షేమ సెస్‌ను అమలు చేయనున్నది. ఎవరికీ చెందని, రోడ్లపై తిరిగే ఆవులను సంరక్షించడం కోసం ఈ సెస్‌ను విధించనున్నది. గో సంరక్షణ సెస్‌ విధింపునకు రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గోవుల సంరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పంచాయితీలు, పట్టణాలు, నగరాల్లో తాత్కాలిక గోశాలలు నిర్మించడంతో పాటు, కబ్జాలో ఉన్న మేత మైదానాలను విడిపించి…అట్టి మైదానాలను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు  తీసుకోనున్నది.

గో సంరక్షణ చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని ఎవరూ అభ్యంతర పెట్టరు కానీ, గో సంరక్షణ పేరుతో అమాయకులపై జరిగే దాడులు, దౌర్జన్యాలపై ప్రభుత్వం స్పందించకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గో సంరక్షణే కాదు ప్రభుత్వానికి  ప్రజలను రక్షించాల్సిన  బాధ్యత కూడా ఉందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.