ఇదేం ఉదాహరణ!

34 views

న్యూస్ ఆర్బిట్: ముస్లింల పట్ల దేశంలో ప్రధాన స్రవంతి సమాజం వైఖరి ఎలా ఉందో తెలిపే ఉదంతం ఇది. అసోంలో 12 వ తరగతి పాఠ్యపుస్తకం గైడ్ ముద్రించిన ఒక పబ్లిషర్ దానిని ఉపసంహరించాల్సి వచ్చింది. కారణం అందులో ఒక ఉన్న ఒక వివక్షాపూరిత వ్యాఖ్య.

గువహతికి చెందిన ఆర్‌జి పబ్లికేషన్స్ ఆ గైడ్ ముద్రించింది. 12వ తరగతికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి సిఫారసు చేసిన అస్సామీ భాష పాఠ్యపుస్తకం సాహిత్య సౌరవ్‌కు అది గైడ్. అందులో ‘పానీ కోర్’ అనే అస్సామీ మాటలకు తెలుగులో ‘ఆశలు అడియాలు చేయడం’ అని అర్ధం. దానిని సోదాహరణంగా వివరించాల్సి వచ్చినపుడు, ‘ఆ అమ్మాయి ముస్లిం యువకుడిని వివాహమాడి తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేసింది’ అని అందులో రాశారు.

గైడ్ పుస్తకం బయటకు రాగానే అందులోని ఈ వాక్యం పట్ల విమర్శలు వచ్చాయి. దానితో పబ్లిషింగ్ సంస్థ యజమాని రాకేష్ గోస్వామి క్షమాపణ చెప్పారు. పుస్తకం ముద్రణ నిలిపివేస్తున్నామనీ, ఇప్పటికే అమ్ముడయిన పుస్తకాలను వెనక్కుతెప్పిస్తామనీ ఆయన చెప్పారు.

గైడ్ పుస్తకం సంపాదకులైన రాజ్‌బోంగ్షి, మేరీ పూజారి తమ పొరపాటు అంగీకరించారనీ, దానిని సరిచేసి కొత్త పుస్తకం విడుదల చేస్తామనీ పేర్కొన్నారు. ఇలాంటి పొరపాట్లు ఇకముందు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అసోం విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.