దేశంలోని బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్‌లో దాక్కున్న విజయ్ మాల్యాను ఇక్కడకు రప్పించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.
న్యాయపరమైన చిక్కుల వల్లే ఆయనను రప్పించడంలో ఆలస్యం జరుగుతోందని కోర్టుకు వెల్లడించింది. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం రూ. 9,000 వేల కోట్లను అప్పుగా దేశంలోని వివిధ బ్యాంకుల నుంచి విజయ్ మాల్యా పొందారు. ఆ తర్వాత ఈ అప్పును తిరిగి చెల్లించకుండా, దేశం విడిచి పారిపోయారు. విజయ్ మాల్యాను దేశానికి రప్పించే విషయంలో మరింత స్పష్టమైన సమాధానం ఇచ్చేందుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గడువు కోరడంతో కేసును మార్చి 15కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. జస్టిస్ యూ యూ లలిత్, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ విజయ్ మాల్యా కేసును విచారిస్తోంది. విజయ్ మాల్యాను ఇక్కడకు రప్పించే విషయంలో స్టేటస్‌పై ఎక్స్టర్నల్ ఎఫెయిర్స్ మినిస్ట్రీ ఆఫీసర్ దేవేష్ ఉత్తమ్‌కు యూకే గవర్నమెంట్ రాసిన లెటర్‌ను సుప్రీం కోర్టుకు మెహతా అందచేశారు. మాల్యాను రప్పించడానికి యూకే గవర్నమెంట్‌తో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, అన్ని రకాల ప్రయత్నాలనూ సీరియస్‌గా చేస్తోందని తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. కానీ, స్టేటస్ మారడం లేదని తెలిపారు. యూకే ప్రభుత్వంలోని నాయకులతోనూ, అధికారులతోనూ కేంద్ర ప్రభుత్వం చర్చల ద్వారా తన ప్రయత్నాలను చేస్తోందని చెప్పారు. మెహతా ఇచ్చిన లెటర్‌ను కోర్టు రికార్డులలోకి తీసుకుంది. దేశంలోని బ్యాంకులకు రూ. 9 వేల కోట్లు చెల్లించాల్సిన విజయ్ మాల్యా మార్చి 2016 నుంచీ యూకేలోనే ఉంటున్నారు. ఆగస్టు 18, 2017లో ఎక్స్ట్రాడిషన్ కేసులో స్కాట్లాండ్ యార్డ్ కోర్టు వారంట్‌ను ఎగ్జిక్యూట్ చేసింది. అంటే మూడేళ్ల నుంచి విజయ్ మాల్యా బెయిల్‌పైనే ఉన్నారు.
ఎప్పుడు పంపుతామో ఇప్పుడే చెప్పలేమన్న యూకే!
మాల్యాను యూకే నుంచి పంపించే విషయంలో మరి కొన్ని లీగల్ సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాకే పంపగలుగుతామని, యూకే గవర్న్మెంట్ మన ఎక్స్టర్నల్ ఎఫెయిర్స్ మినిస్ట్రీకి రాసిన లెటర్లో పేర్కొంది. తమ చట్టాల ప్రకారం ఈ సమస్య పరిష్కారమైతే తప్ప, ఇండియాకు పంపించలేమని తెలిపింది. సమస్య న్యాయపరమైనది కావడంతో ఇంతకు మించిన వివరాలు ఇవ్వడం సాధ్యంకాదని కూడా యూకే గవర్నమెంట్ ఈ లెటర్లో స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ సమస్య పరిష్కారానికి ఎంత టైము పడుతుందనేది కూడా కచ్చితంగా చెప్పలేమని పేర్కొంది. భారత ప్రభుత్వానికి ఈ కేసు ఎంత ముఖ్యమైనదో తమకు తెలుసని, వీలైనంత తొందరగా సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని మాత్రం యూకే గవర్నమెంట్ హామీ ఇచ్చింది. వీలైనంత తొందరగా విజయ్ మాల్యాను ఇండియాకు తీసుకెళ్లాలని భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మన ఫారిన్ సెక్రటరీ హర్ష్వర్ధన్ ష్రింగ్లా యూకే హోమ్ సెక్రటరీ ప్రీతి పటేల్‌తో నవంబర్ 2020లోనే మాల్యాను తీసుకెళ్లేందుకు తమ ప్రయత్నాలను వివరించారు. ఆ తర్వాత ఫారిన్ ఎఫెయిర్స్ మినిస్టర్ డా జైశంకర్ కూడా డిసెంబర్ 2020లో యూకే ఫారిన్ సెక్రటరీ డొమినిక్ రాబ్‌తో సమస్యపై చర్చించారని, ఈ ఏడాది జనవరిలోనూ ఇండియా హోమ్సెక్రటరీ యూకే పర్మినెంట్ అండర్ సెక్రటరీ (హోమ్)తో చర్చించారని ఈ లెటర్లో యూకే గవర్నమెంట్ ప్రస్తావించింది.
దానికో సీక్రెట్ లీగల్ ప్రాసెస్ ఉందన్న ఇండియా!
విజయ్ మాల్యాను ఇక్కడకు రప్పించే విషయంలో స్టేటస్ రిపోర్టును ఫైల్ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు కిందటి సంవత్సరం నవంబర్ 2న ఆదేశించింది. ఆరువారాలలో ఈ స్టేటస్ రిపోర్టును ఇవ్వమని కోరింది. యూకేలోని చట్టాల ప్రకారం ఒక సీక్రెట్ లీగల్ ప్రాసెస్ పూర్తయితే తప్ప విజయ్ మాల్యాను యూకే గవర్నమెంట్ ఇండియాకు పంపించడం కుదరదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెబుతోంది.మొత్తంగా చూస్తే విజయ్ మాల్యా పని యూకేలో హ్యాపీగానే ఉంది.