కరోనావైరస్ ఎన్నిరకాలుగా మ్యుటేషన్ అవుతుందో.. దాని లక్షణాలు కూడా అలానే మారిపోతున్నాయి. ప్రధాన కరోనా లక్షణాల్లో కంటే ఊహించని అరుదైన కొత్త లక్షణాలు ఒక్కొక్కటిగా కనిపిస్తున్నాయి.
అసలు ఈ లక్షణాలను చూస్తే.. కరోనా సోకిందనే విషయం తెలియదు.. సాధారణ లక్షణాల మాదిరిగానే కనిపిస్తాయి. కరోనా సోకినవారిలో నోరు, నాలుకపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని యూకే సైంటిస్టు, కింగ్ కాలేజీ లండన్ యూనివర్శిటీకి చెందిన జనెటిక్ ఎపిడిమోలాజిస్ట్ టిమ్ స్పెక్టార్ హెచ్చరిస్తున్నారు.
కోవిడ్ టంగ్ ని కనిపెట్టిన స్పెక్టార్
తన పరిశోధనలో భాగంగా ఆయన కరోనా బాధితుల నాలుక ఫొటో ఒకటి షేర్ చేశారు. ఆ ఫొటోలో కరోనా బాధిత వ్యక్తి నాలుకపై అసాధారణ స్థితిలో తెల్లని మచ్చలతో నిండి ఉన్నాయి. దీనికి ఆయన ‘COVID Tongue’ అని పేరు పెట్టారు. ఇంగ్లాండ్ లో కరోనా అధికారిక లక్షణాల జాబితాలో ఈ కోవిడ్ టంగ్ అనే లక్షణం లేదన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కరోనా నోటి లక్షణాల జాబితాలో కూడా ఈ లక్షణాన్ని చేర్చలేదన్నారు. అందుకే నోరు, నాలుకపై ఇలాంటి అసాధారణ మచ్చలు కనిపిస్తే.. అది కరోనా అయి ఉండొచ్చునని ఆయన హెచ్చరిస్తున్నారు.ముందు జాగ్రత్త చర్యగా వెంటనే బాధితులు సెల్ఫ్ ఐసోలేట్ కావడం మంచిదని సూచిస్తున్నారు.
అరుదైన కరోనా లక్షణమిది!
కరోనా లక్షణాల్లో ఇలాంటి అరుదైన లక్షణాలు ఐదుగురిలో ఒకరికి కనిపిస్తోందన్నారు. అతి తక్కువ చర్మవ్యాధుల సాధారణ లక్షణాల్లో ఇదొకటిగా స్పెక్టార్ చెప్పుకొచ్చారు. చూడటానికి అచ్చం మౌత్ అల్సర్లు మాదిరిగానే కనిపిస్తాయని అంటున్నారు. కొంతమందిలో ఈ లక్షణంతో పాటు తలనొప్పి, అలసటగా అనిపించడం జరుగుతుందని తెలిపారు. అందుకే ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు.
లోతుగా పరిశోధన!
ZOE Covid Symptom స్టడీ యాప్ ద్వారా ప్రొఫెసర్ స్పెక్టార్ కరోనా లక్షణాలు కలిగిన వారి వివరాలను సేకరించారు. ప్రపంచవ్యాప్తంగా 4.5 మిలియన్ల మంది కరోనా బాధతుల డేటాను విశ్లేషించారు. కరోనాకు నోరు, నాలుకకు సంబంధించి లక్షణాలు కనిపించడం ఇది తొలిసారి కాదు.. గత 2020 జూన్లో నోటి అల్సర్లు వంటి సమస్యలతో బాధపడిన వారిలో కరోనా లక్షణాలతో సంబంధం ఉందని గుర్తించారు.ఏదేమైనప్పటికీ కరోనా లక్షణాలు ఎప్పటికప్పుడు మారిపోతుండటంతో ఈ మహమ్మారి ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో ఆవహిస్తుందో చెప్పడం కష్టతరంగా మారుతోంది .