లోకోపైలెట్ ఆరోగ్య పరిస్థితి విషమం

హైదరాబాద్: కాచిగూడ స్టేషన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఎంఎంటిఎస్ లోకో పైలెట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు కేర్ ఆసుపత్రి సూపర్నిటెండెంట్ డాక్టర్ సుష్మ తెలియజేశారు. ప్రమాదంలో గాయపడి హాస్పటల్‌లో చికిత్స పొందుతున్న చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై మంగళవారం ఆమె హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

లోకోపైలెట్ చంద్రశేఖర్ రెండు కాళ్లకు రక్త ప్రసరణ తగ్గిందనీ, పక్కటెముకలు, మూత్రపిండం దెబ్బతిన్నాయనీ ఆమె పేర్కొన్నారు.

మరో పక్క రైలు ప్రమాదానికి కారణమైన లోకోపైలెట్‌ చంద్రశేఖర్‌పై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. కాచిగూడ రైల్వే స్టేషన్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రశేఖర్‌పై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.