Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఏపీ సీఐడీ అరెస్టు చేసి అయిదు వారాలు దాటింది. గత నెల 9వ తేదీన నంద్యాల పర్యటనలో ఉన్న సమయంలో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేసి మరుసటి రోజు విజయవాడ ఏసీబీ కోర్టులో హజరుపర్చారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి రిమాండ్ ఆదేశాలతో రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించారు. గత 37 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే అండర్ ట్రైల్ ఖైదీగా చంద్రబాబు ఉన్నారు. ఆయన బెయిల్ ప్రయత్నాలు ఇప్పటి వరకూ ఫలించలేదు. చంద్రబాబుకు సంబంధించి పిటిషన్లు ఈ రోజు హైకోర్టు, సుప్రీం కోర్టులో విచారణ జరగనున్నాయి.

నెల రోజులకుపైగా పార్టీ అధినేత చంద్రబాబు జైలులో ఉండటంతో ఆ పార్టీ క్యాడర్ తీవ్ర నిరుత్సాహంలో ఉంది. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎప్పుడూ చవి చూడలేదు. తొలి సారిగా ఆయన జైలు గోడల మధ్య అయిదు వారాలకుపైగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు ఇన్ని రోజుల పాటు జైలులో ఉంటారని ఎవరూ ఊహించలేదు. అరెస్టు అయిన వెంటనే బెయిల్ పై బయటకు వస్తారని ఆ పార్టీ శ్రేణులు భావించారు. అయితే వారి అంచనాలు తల్లకిందులైయ్యాయి. అరెస్టు అయిన వెంటనే చంద్రబాబు తరపు న్యాయవాదులు బెయిల్ ప్రయత్నాలు ప్రారంభించకుండా ఎఫ్ఐఆర్ లోని సాంకేతిక అంశాల ఆధారంగా కేసు క్వాష్ కోసం న్యాయపోరాటం ప్రారంభించారు. ఈ క్రమంలో మరి కొన్ని కేసులు ఆయనను చుట్టుముట్టడంతో నాలుగు కేసుల్లో బెయిల్ పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక ఈ రోజు అక్టోబర్ 17 (మంగళవారం) చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణులకు అత్యంత కీలకంగా కానుంది. హైకోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై నేడు విచారణలు జరుగుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ తన పై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని సుప్రీం కోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై ఇవేళ తుది విచారణ జరగనుంది.

ఇంతకు ముందు విచారణల సమయంలో చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. సెక్షన్17ఏ చంద్రబాబు కేసులో వర్తిస్తుందని ఆయన తరపు న్యాయవాదులు, వర్తించదని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇవేళ జరగనున్న తుది విచారణ అనంతరం జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిల్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎటువంటి తీర్పు ఇవ్వనుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుకు తక్షణ ఉపశమనం ఏమైనా లభిస్తుందా.. లేదా తీర్పు రిజర్వు చేస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరో పక్క ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా ఇదే ధర్మాసనం ఇవేళ విచారించనుంది. ఈ కేసులోనూ 17ఏ వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. చంద్రబాబుకు అంగళ్లు కేసులో మాత్రం ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మద్యంతర ఉత్తర్వులు హైకోర్టు ఇచ్చింది. ఇటు ఏపీ హైకోర్టులోనూ ఇవేళ స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ పిటిషన్ పై వాదనలు జరగనున్నాయి. ఇటు హైకోర్టు, అటు సుప్రీం కోర్టులలో ఇవేళ చంద్రబాబు కేసుల విచారణ జరుగుతుండటంతో ఎటువంటి ఉత్తర్వులు వెలువడతాయనే దానిపై ఎవరికి తోచిన విధంగా వారు రకరకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు.
KCR: కేసీఆర్ లో ఈ మార్పునకు కారణం ఏమిటి..? కాంగ్రెస్ యే లక్ష్యంగా విమర్శలు