ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాజాగా ఓ వివాదంలో చిక్కుతున్న సంగతి తెలిసిందే. వివిధ సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, ఆ తర్వాత సంజాయిషీ ఇచ్చుకోవడం పరిపాటిగా మారింది. అన్ స్టాపబుల్ షోలో నర్సులను కించపరిచేలా బాలకృష్ణ వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని, ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నర్సుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందించి వివరణ ఇచ్చారు. తన పై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. తన మాటలను కావాలనే వక్రీకరించారని బాలయ్య పేర్కొన్నారు. “రోగులకు సేవలు అందించే నా సోదరీమణులంటే నా కెంతో గౌరవం. బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను, రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నా కెంతో గౌరవం. వాళ్లకు ఎన్ని సార్లు కృతజ్ఞతలు తెలిపినా తక్కువే. కరోనా వేళ ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతో మంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతో సేవలందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా’ అంటూ బాలయ్య ట్వీట్ చేశారు.
ఇటీవల పవన్ ఎపిసోడ్ లో బాలయ్య తన కు జరిగిన యాక్సిడెంట్ గురించి పవన్ కు వివరిస్తూ తనకు వైద్యం చేసిన నర్సును ఉద్దేశించి .. ఆ నర్సు భలే అందంగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఏపి నర్సింగ్ సంక్షేమ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. బాలకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలనీ, నర్సులకు బహిరంగ క్షమాపణ లు చెప్పాలని డిమాండ్ చేసింది. క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
దీని కంటే ముందు ఒక షోలో అక్కినేని తొక్కినేని అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆ అంశంపైనా బాలయ్య స్పందించి వివరణ ఇచ్చారు. అది సద్దుమణిగిన వెంటనే ఈ వ్యాఖ్యల దుమారం రేగింది. దీనిపై బాలయ్య స్పందించి పశ్చాతాపం వ్యక్తం చేయడంతో ఈ వివాదానికి తెరపడినట్లు అయ్యింది.
తెలంగాణ బడ్జెట్ రూ.2,90,396 కోట్లు .. కేటాయింపులు ఇలా..