heroine chandini: అన్నా డీఎంకే నేత, మాజీ మంత్రి మణికందన్ పై ఓ సినీ నటి సంచలన ఆరోపణలు చేయడం తమిళనాట హాట్ టాపిక్ అయ్యింది. తనతో మాజీ మంత్రి మణికందన్ ప్రేమాయణం నడిపారనీ, పెళ్లి పేరు ఎత్తితే ముఖం చాటేశాడని ఆమె ఆరోపించింది. తనను మాజీ మంత్రి మణికందన్ మోసం చేశారంటూ సినీ నటి చాందిని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు మణికందన్ కు ఉన్న పరిచయాన్ని, సాన్నిహిత్యాన్ని వివరించి తమ సంబంధాలపై వాట్సాప్ ఛాటింగ్, వీడియో కాల్స్ వివరాలను మీడియాకు చూపించారు.
2017లో మణికందన్ తో తనకు పరిచయం ఏర్పడిందన్న తమిళ సినీ నటి చాందిని..ఆ తరువాత తమ స్నేహం ప్రేమగా మారిందన్నారు. వివాహం చేసుకుంటానని హామీ ఇవ్వడంతో అయిదేళ్లపాటు సహజీవనం చేశామన్నారు. పెళ్లి పేరు ఎత్తినప్పుడల్లా కాలయాపన చేస్తూ వచ్చారనీ, ఈ క్రమంలో తాను మూడు సార్లు గర్భవతిని అయ్యాననీ, మణికందన్ ఒత్తిడి వల్ల అబార్షన్ చేయించుకున్నానని తెలిపింది. తీరా ఇప్పుడు పెళ్లి చేసుకోనంటున్నాడని ఆమె చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం గురించి ఎక్కడైనా చెబితే ప్రైవేటు ఫోటోలు లీక్ చేస్తానంటూ మణికందన్ బెదిరిస్తున్నాడని ఆమె ఆరోపించింది.
Read More: Big Breaking: ఎయిర్ ఫోర్స్ కార్గో విమానానికి అగ్నిప్రమాదం..!!
చాందిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాజీ మంత్రి మణికందన్ పై గతంలో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న పాత్రలో నటిస్తున్న చాందిని ఆరోపించడం, వాటికి సంబంధించి పలు ఆధారాలు చూపడం తమిళ రాజకీయ వర్గాల్లో ఇది తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ పరిణామంతో మాజీ మంత్రిపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడానికి మంచి అవకాశం చిక్కినట్లు అయ్యింది. దీనిపై మణికందన్ ఇంకా స్పందించలేదు.