విభజన తీరు సమ్మతం కాదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్రంపై విమర్శలు గుప్పించేందుకు ఏ అవకాశాన్నీ వదులు కోవడం లేదు. తాజాగా హైకోర్టు విభజన తీరు సవ్యంగా లేదంటూ మండిపడ్డారు. జనవరి నాటికల్లా అమరావతిలో హైకోర్టు ఏర్పాటుకు అభ్యంతరం లేదనీ, భవనాలు సిద్ధమైపోతాయనీ సుప్రీం కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అనంతరమే   ఉమ్మడి హైకోర్టును విభజించి జనవరి 1 నుంచి తెలంగాణ, ఏపీ హైకోర్టులు విడివిడిగా పని చేస్తాయంటూ గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది.

న్యాయమూర్తుల కేటాయింపూ జరిగిపోయింది. తీరా అన్ని అయిపోయి వేర్వేరుగా రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులూ ప్రారంభం కావడానికి సర్వం సిద్ధమయ్యాకా…కేంద్రం తీరుపై చంద్రబాబు విరుచుకుపడుతున్నారు. విభజన తీరు సవ్యంగా లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. హైకోర్టు తాత్కాలిక భవనం పూర్తయ్యేంత వరకూ విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీసులో ఏపీ కోర్టు నడుస్తుందని నిన్ననే ప్రకటించిన చంద్రబాబు ఈ ఉదయం మాత్రం ఎలాంటి సంప్రదింపులూ లేకుండా హైకోర్టును విభజించారంటూ ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ఏ మాత్రం సమయం ఇవ్వకుండా జనవరి 1కల్లా వెళ్లిపోవాలంటూ దబాయించడం సరికాదని చంద్రబాబు అంటున్నారు. ఏపీ పట్ల కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదనీ, ఏపీ భారత్ లో భాగం కాదా అని ప్రశ్నించారు. ఇక జగన్ అవినీతి కేసులు మళ్లీ మొదటికొస్తాయన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ హడావుడి విభజన చూస్తుంటే బీజేపీ, వైకాపా లాలూచీ తేటతెల్లమైపోతున్నదని చంద్రబాబు పేర్కొన్నారు.