మిషన్ బిల్డ్ ఏపిపై హైకోర్టులో విచారణ వాయిదా

 

(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)

ప్రభుత్వ ఆస్తుల విక్రయం (మిషన్ బిల్డ్ ఏపి) పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ప్రభుత్వ భూముల అమ్మకాలను సవాల్ చేస్తూ గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేష్ మే 22న హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ జె ఉమాదేవి తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారిస్తున్నది. ప్రభుత్వం తరపున కౌంటరు పిటిషన్‌లు అందని కారణంగా విచారణను  వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. తుది తీర్పునకు లోబడే ఆక్షన్‌ ఉండాలని, గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కేసు తదుపరి ఆదేశాల వరకు కొనసాగింపు ఉంటుందని ధర్మాసనం పేర్కొన్నది. పిటిషనర్ తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి రైతుల నుండి ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూములను మిషన్ బిల్డ్ ఏపిలో భాగంగా విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. నవరత్నాలు, నాడు నేడు లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన నిధుల కోసం 2019 నవంబర్ నెలలో ఏపి ప్రభుత్వం నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పోరేషన్ (ఎన్‌బీసీసీ) తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మిషన్ బిల్డ్ ఏపి పేరుతో ప్రభుత్వ భూములను అమ్మేస్తున్నారనే ఆరోపణలతో పాటు ప్రభుత్వ ప్రయోజనాల కోసం దాతలు ఇచ్చిన భూములను కూడా ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని పిటిషనర్ కోర్టుకు వివరించారు. ఈ భూములను విక్రయించడం సరికాదని పిటిషనర్ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదిస్తున్నారు.