ప్రారంభమైన హైకోర్టు తరలింపు

హైదరాబాదు, డిసెంబర్ 31: హైకోర్టు సిబ్బంది ఆంధ్రప్రదేశ్ దారి పట్టారు. జనవరి ఒకటవ తేదీన విజయవాడలో ఎపి హైకోర్టు ప్రారంభం కానున్నది. నోటిఫికేషన్ తర్వాత తరలివెళ్లేందుకు నాలుగే రోజుల వ్యవధి ఉండడంతో తాత్కాలిక జాబితా ప్రకారం ఉద్యోగుల విభజన చేశారు. వారంతా సోమవారం విజయవాడ బయలుదేరారు. సిబ్బంది, ఫైళ్ల తరలింపునకు పది ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.

మంగళవారం ఉదయం 8.30 గంటలకు తెలంగాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయనుండగా ఉదయం 11.30 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు కార్యకలాపాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. న్యాయమూర్తులు, అధికారుల వసతికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

జనవరి ఒకవట తేదీన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారానికి విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. హైకోర్టు కార్యాలయం కోసం ఎంజీ రోడ్డులోని ఏపీఏటీ భవనంలో పది వేల చదరపు అడుగులు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ ఉత్తర్వులు ఇచ్చారు. ఫర్నీచర్ సమకూర్చే పనిని సీఆర్‌డీఏకి, హైకోర్టు కార్యకలాపాలకు అవసరమైన కంప్యూటర్‌లను సమకూర్చే పనిని ఐటీ శాఖకు అప్పగించారు.

హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్‌లకు నోవోటెల్ హోటల్‌లో వసతి ఏర్పాటు చేయాలని ప్రోటోకాల్ డైరెక్టర్‌ను ఆదేశించారు. ఇతర న్యాయశాఖ అధికారులకు స్టేట్ గెస్ట్ హౌస్‌లో వసతి ఏర్పాటు చేస్తున్నారు.