అమరావతిలో ఉద్యోగులకు ఇళ్లు

అమరావతి, జనవరి 5: రాష్ట్ర ప్రగతి రధ చక్రాలు ప్రజలు, ఉద్యోగులేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం జన్మభూమి కార్యక్రమాలపై కలెక్టర్‌లతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేది ప్రజలు, ఉద్యోగులేనన్నారు. హైదరాబాదులో 30-40 ఏళ్ల అనుబంధం ఉన్నప్పటికీ ఉద్యోగులు, న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చారన్నారు. హైదరాబాదు నుండి అర్థాంతరంగా వచ్చిన ఉద్యోగులు, న్యాయవాదులు నిలదొక్కుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఉద్యోగుల కోసం ఇళ్ల స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అపార్ట్‌మెంట్‌లు నిర్మించి ఫ్లాట్‌లు కేటాయిస్తామన్నారు.

64 ఏళ్లుగా ఇబ్బందులు పెడుతున్న చుక్కల భూముల సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్‌లు చొరవ తీసుకోవాలని, ఈ సమస్యలను ప్రభుత్వమే సుమోటోగా తీసుకొవాలని ఆదేశించారు.