శాకాహారులు – మాంసాహారులు అనే రెండువర్గాల గురించి మనకు తెలుసు. మాంసాహారుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలిసింది ఏమిలేదు. కోడిమాంసం, మటన్, చేపలు రొయ్యలు,పీతలు సుష్టుగా తినేస్తారు.కానీ ఈ శాకాహారుల్లో శాఖోపశాఖలుగా ఉన్నారు. వారు ఎన్ని రకాలో తెలుసుకుందాం.
కొందరు పూర్తిగా శాకాహారులుగా చెప్పుకుంటారు. వీరు కోడిమాంసం, మటన్లాంటివి తినరు. కేవలం కోడి గుడ్డు మాత్రమే తింటూ మేము శాకాహారుల మే అని చెప్పుకుంటారు.మరీ గుడ్డు తింటున్నారుగా అంటే మాత్రం.. గుడ్డు శాకాహారమేగా అని తడుముకోకుండా చెప్పేస్తారు. అందుకే వీరిని ‘ఎగ్టేరియన్లు’ అని పిలుస్తుంటారు.
ఇంకొందరు గుడ్డు తినరు,కోడి మాంసం , మటన్ ముట్టుకోరు కానీ వీరి పద్దతి మరింత వింతగా ఉంటుంది. వాటి నుంచి వచ్చేపులుసు మాత్రం నిర్మోహమాటంగా తినేస్తుంటారు .. చెప్పాలంటే ముక్కల సారమంతా పులుసులోనే ఉంటుంది. ముక్క మాత్రం తినరు. కేవలం వాటి నుంచి వచ్చే పులుసు మాత్రమే తింటారు కాబట్టి వీరిని ‘గ్రేవిటేరియన్లు’ అంటారు.
ఇంకొందరు ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు తింటారు. కానీ అప్పుడప్పుడుకుటుంబం లో జరిగే వేడుకలలో, ఆఫీస్లో వారి స్నేహితులతో పార్టీలో ఉండవలిసి వచ్చినప్పుడు.. స్నేహితుల ఒత్తిడి చేస్తే వీరు మాంసం తింటారు. పార్టీ కి వెళ్ళినప్పుడు తప్ప మరి ఎప్పుడు ప్రత్యేకంగా మాంసాహారం జోలికి పోరు. మాంసాహారులతో కలిసి తినేందుకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉంటుందనే భావన తో ఇలా చేస్తుంటారు.
మరి కొందరిది శాకాహారుల జాతి అయినా కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వీరు మాంసాహారులుగా మారుతుంటారు. మద్యం ముందు కూర్చున్నారంటే,వీరికి ముక్క ఉండవలిసిందే. ముక్కలేకుండా వీరికి చుక్క గొంతులో దిగదు. అందుకే వీరిని ‘బూజిటేరియన్లు’ అంటారు.
ఇంకొందరు క్యాలెండరియన్లు వీరు వారాన్ని బట్టి మారుతూ ఉంటారు. ఆదివారం మాంసాన్ని చక్కగా తింటారు. కానీ సోమ, మంగళ వారాల్లో మాత్రం మాంసం తినరు. వీరు కొన్ని వారాలు దేవుళ్లకు ఇచ్చేస్తుంటారు.
కొందరు ఇంట్లో పక్కా శాకాహారులు కానీ బయట భోజనం చేయవలసి వస్తే మాత్రం ఖచ్చితం గా ముక్కు లేకుండా ముద్ద దిగదు. ఇంట్లో వాళ్లకు వీరి నిజ స్వరూపం తెలిసే అవకాశం కూడా చాల తక్కువ. ఎందుకంటే దానికి సంబందించి జాగ్రత్తలు వీళ్లు బాగా తీసుకుంటారు. మొత్తానికి శాఖాహారుల శాఖలు ఇవి.. ఇప్పుడు చెప్పండి మీరు ఏ శాఖకు చెందినవారో.