ఎస్బీఐలో మీకు సేవింగ్స్ అకౌంట్ ఉందా ? అందులో మొబైల్ నంబర్ అప్డేట్ అయి ఉందా ? లేకపోతే వెంటనే అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే మొబైల్ నంబర్‌ను అప్ డేట్‌గా ఉంచుకోవడం వల్ల బ్యాంక్ నుంచి అన్ని రకాల ముఖ్యమైన సమాచారానికి చెందిన మెసేజ్‌లు వస్తాయి. అలాగే మీ అకౌంట్లో ఏదైనా అనుమానాస్పద లావాదేవీ జరిగిందని తెలిస్తే వెంటనే ఫిర్యాదు చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. కనుక ఎస్బీఐలో మీ మొబైల్ నంబర్‌ను ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంచుకోవాలి. అందుకు గాను కింద తెలిపిన పలు విధానాలను మీరు ట్రై చేయవచ్చు. వీటి సహాయంతో మీ ఎస్బీఐ అకౌంట్లో మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకోవచ్చు.
నెట్ బ్యాంకింగ్ ద్వారా…
* onlinesbi.com అనే సైట్‌ను ఓపెన్ చేయాలి. అందులో మీ అకౌంట్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో లాగిన్ అయ్యాక, మై అకౌంట్ అండ్ ప్రొఫైల్ విభాగంలో ప్రొఫైల్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* అనంతరం ప్రొఫైల్ మెనూలోని పర్సనల్ డిటెయిల్స్ లో మొబైల్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తరువాత ప్రొఫైల్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. అక్కడ పేరు, ఈ-మెయిల్ ఐడీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కనిపిస్తాయి. అక్కడ ఉండే చేంజ్ మొబైల్ నంబర్ – డొమెస్టిక్ ఓన్లీ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
* అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో పర్సనల్ డిటెయిల్స్ – మొబైల్ నంబర్ అప్డేట్ అని 3 ఆప్షన్లు కనిపిస్తాయి. క్రియేట్ రిక్వెస్ట్, క్యాన్సిల్ రిక్వెస్ట్, స్టేటస్లు ఉంటాయి. వాటిల్లో క్రియేట్ రిక్వెస్ట్‌ను ఎంచుకుని కొత్త మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
* తరువాత వచ్చే పాపప్ మెసేజ్‌ను క్లిక్ చేసి మొబైల్ నంబర్‌ను కన్ఫాం చేయాలి. దీంతో మొబైల్ నంబర్‌ను పలు విధానాల్లో చేంజ్ చేసుకునే ఆప్షన్లు కనిపిస్తాయి. వన్ టైం పాస్వర్డ్ లేదా ఏటీఎం లేదా బ్రాంచ్ ద్వారా మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకోవచ్చు.
* అనంతరం డెబిట్ కార్డుకు అనుసంధానం అయి ఉన్న అకౌంట్‌ను ఎంచుకుని ముందుకు ప్రొసీడ్ అవ్వాలి.
* తరువాత వచ్చే స్క్రీన్‌లో మీ యాక్టివ్, ఇనాక్టివ్ అకౌంట్లకు లింక్ అయి ఉన్న డెబిట్ కార్డులు కనిపిస్తాయి. వాటిల్లో యాక్టివ్ అకౌంట్‌కు లింక్ అయి ఉన్న ఏదైనా యాక్టివ్ డెబిట్ కార్డును ఎంచుకుని ప్రొసీడ్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
* కార్డుకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేసి కాప్చా కోడ్ నమోదు చేసి సబ్మిట్ నొక్కాలి.
* వెరిఫికేషన్ పూర్తయ్యాక పే అనే బటన్ మీద క్లిక్ చేసి తరువాత సూచించే స్టెప్స్‌ను అనుసరించాలి. ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ రిక్వెస్ట్ త్రూ ఏటీఎం, కాంటాక్ట్ సెంటర్లలో ఏదైనా ఒక ఆప్షన్‌ను ఎంచుకుని ప్రొసీడ్ అవ్వాలి.
ఓటీపీ ద్వారా…
ఈ విధానం ద్వారా మొబైల్ నంబర్‌ను అప్ డేట్ చేయాలంటే కింది స్టెప్స్ పాటించాలి.
1. కొత్తగా జనరేట్ అయిన ఓటీపీ పాత, కొత్త ఫోన్ నంబర్లకు పంపించబడుతుంది.
2. పాస్వర్డ్లు రాగానే రెండు ఫోన్ నంబర్ల నుంచి 4 గంటల్లోగా.. ACTIVATE అని టైప్ చేసి 567676 అనే నంబర్‌కు ఎస్ఎంఎస్లు పంపాలి.
3. ఓటీపీ వాలిడేట్ అయ్యాక కొత్త మొబైల్ నంబర్ బ్యాంకు రికార్డుల్లో నమోదు అవుతుంది. అందుకు గాను కొత్త మొబైల్ నంబర్‌కు మెసేజ్‌ను కూడా పంపుతారు.
కాంటాక్ట్ సెంటర్ ద్వారా…
పాత మొబైల్ నంబర్ లేనివారు, ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లవద్దు అనుకునే వారు ఈ విధానాన్ని పాటించి తమ మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేయవచ్చు.
1. కస్టమర్ కొత్త ఫోన్ నంబర్‌కు ఎస్ఎంఎస్ను పంపుతారు. అందులో రిఫరెన్స్ నంబర్ ఉంటుంది.
2. అప్డేట్ రిక్వెస్ట్ పెట్టిన 3 రోజుల్లోగా బ్యాంకు సిబ్బంది కాల్ చేస్తారు. వారిని ముందుగా రిఫరెన్స్ నంబర్ అడిగి వెరిఫై చేసుకోవాలి. తరువాతే వివరాలను చెప్పాలి.
3. మొబైల్ నంబర్‌ను బ్యాంకు సిబ్బంది విజయవంతంగా అప్డేట్ చేయగానే.. అది బ్యాంకు రికార్డుల్లో నమోదవుతుంది. దీంతో కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
ఏటీఎం ద్వారా (నెట్ బ్యాంకింగ్ రిక్వెస్ట్‌తో)…
* కొత్త మొబైల్ నంబర్‌కు రిఫరెన్స్ నంబర్‌తో కూడిన ఎస్ఎంఎస్ వస్తుంది.
* సమీపంలో ఉండే ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లి అందులో కార్డును పెట్టాలి. మెనూ ఆప్షన్లలో సర్వీసెస్‌ను ఎంచుకోవాలి. పిన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
* తరువాత వచ్చే విండోలో అదర్స్ అనే ట్యాబ్ ను సెలెక్ట్ చేయాలి. తరువాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్రూవల్ రిక్వెస్ట్‌ను ఎంచుకోవాలి. అనంతరం రిఫరెన్స్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
* రిఫరెన్స్ నంబర్ వెరిఫై అయ్యాక మొబైల్ నంబర్ బ్యాంకు రికార్డుల్లో అప్డేట్ అవుతుంది. అనంతరం కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
ఏటీఎం ద్వారా…
* ఎస్బీఐ ఏటీఎంలో కార్డును పెట్టి అందులో రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* పిన్ నంబర్‌ను ఎంటర్ చేసి అప్డేట్ యువర్ మొబైల్ నంబర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* పాత మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి కన్ఫాం పై ట్యాప్ చేయాలి. తరువాత కొత్త మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి కన్ఫాం చేయాలి.
* పాత, కొత్త ఫోన్ నంబర్లకు ఓటీపీలు వస్తాయి.
* ఓటీపీలను, వాటితో ఉండే రిఫరెన్స్ నంబర్లను 4 గంటల్లోగా 567676 అనే నంబర్‌కు పంపించాలి. లేదా పాత నంబర్ లేకపోతే కొత్త నంబర్‌తోనే ఎస్ఎంఎస్లను పంపించవచ్చు. తరువాత 3 రోజుల్లో కాల్ వస్తుంది. అందులో రిఫరెన్స్ నంబర్‌ను వెరిఫై చేసుకుని వివరాలను చెప్పాలి. దీంతో కొత్త మొబైల్ నంబర్ అప్డేట్ అవుతుంది. కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
కస్టమర్లు ఎస్బీఐకి చెందిన 1800-11-22-11 లేదా 1800-425-3800 అనే నంబర్లకు కాల్ చేయడం ద్వారా కూడా మొబైల్ నంబర్లను అప్డేట్ చేయవచ్చు. ఇందుకు గాను ఏటీఎం కార్డు, పిన్, బ్యాంక్ అకౌంట్ వివరాలను దగ్గర ఉంచుకోవాలి. ఐవీఆర్ఎస్లో అడిగినప్పుడు వాటిని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. తరువాత ఆప్షన్లను అనుసరించి కస్టమర్లు తమ కొత్త మొబైల్ నంబర్‌ను ఎస్బీఐ బ్యాంక్ రికార్డుల్లో అప్డేట్ చేయవచ్చు.