Dethadi Harika : ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పూర్తి ఫేమస్ అయిపోయిన అతి కొద్దిమంది సెలబ్రిటీలలో దేత్తడి హారిక ముందు వరుసలో ఉంటుంది. బిగ్ బాస్ షో ఫైనలిస్టుగా ఆమెకు భారీ గుర్తింపు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మరే ఇతర అమ్మాయికి సాధ్యం కాని రీతిలో పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇదే క్రమంలో ఎన్నో సరికొత్త ఆఫర్లు అందుకుంటోంది.
అయితే తాజాగా హారిక చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా దేత్తడి హారిక ను నియమించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆమెకు నియామక పత్రం కూడా అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు హారిక తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. చాలా మంది ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు కానీ కొంతమంది మాత్రం ఆమె నియామకాన్ని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో లో తెలంగాణ నుంచి మౌంట్ ఎవరెస్ట్, కిలిమంజారో వంటి అతి ఎత్తైన పర్వతాలను అధిరోహించిన మలావత్ పూర్ణ, అలాగే మిస్ ఇండియా గా ఎంపికైన వారణాసి మానస వంటి ఫిమేల్ పర్సనాలిటీలని కాకుండా బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన హారిక ను తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇక ఇదే క్రమంలో ఆమెను ఎంపిక చేసినట్టే చేసి వెంటనే తొలగించారని కూడా వైరల్ అయింది. అయితే టి ఎస్ టి డి సి సంస్థ చైర్మన్ అటువంటిది మాత్రం ఏమీ లేదని కొందరు గిట్టని వాళ్లు ఆమెను తొలగించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. మరి ఇప్పుడిప్పుడే తర్వాతి స్థాయి కి వెళ్తున్న హారిక పై ఈ నెగిటివిటీ ఎప్పటికి తొలగిపోతుందో చూడాలి.