Huzurabad Bypoll: రాజకీయాల్లో తమ ప్రత్యర్థిని దెబ్బతీయడానికి అనేక అస్త్రాలను ప్రయోగిస్తుంటారు. ఎన్నికల సమయంలో ఆ నేతలకు ప్రజల అభిమానం ఉన్నప్పటికీ అది వారికి దక్కకుండా చేయడం కూడా ఒక ఎత్తుగడ. ఎన్నికల్లో తాయిలాలు ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. హూజారాబాద్ లో బీజేపీ అభ్యర్థిగా ఉన్న ఈటల రాజేందర్ ను దెబ్బతీయడానికి అధికార టీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. పేరుకు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అయినప్పటికీ ప్రధానమైన పోటీ కేసిఆర్ వర్సెస్ ఈటల అన్నట్లు ఉంది. హూజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు బాధ్యతలను పూర్తిగా మంత్రి హరీష్ రావు భుజస్కందాలపై వేసుకుని వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఈటల టీఆర్ఎస్ నుండి బయటకు వెళ్లినప్పటి నుండి ఆయనకు వెన్నుదన్నుగా వెళ్లిన నేతలను టీఆర్ఎస్ ప్రలోభపెట్టి వెనక్కు లాగేసింది. ఒక పక్క దళిత బంధు పథకాన్ని అమలు చేయడంతో పాటు కుల సంఘాలకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించారు. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు నుండే హరీష్ రావుతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తిష్టవేసి కార్యక్రమాలను చక్కబెడుతున్నారు. ఇక నామినేషన్ల ప్రక్రియలోనూ మరో స్కెచ్ కూడా వేసింది టీఆర్ఎస్. ఈ స్కెచ్ బీజేపీ వర్గాల్లో, ఈటల వర్గీయుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.

Huzurabad Bypoll: హుజూరాబాద్ బరిలో నలుగురు రాజేందర్ లు
హుజూరాబాద్ లో నిన్నటితో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 61 మంది నామినేషన్లు దాఖలు చేయగా అందులో రాజేందర్ పేరుతో మరో ముగ్గురు ఉండటం వారి ఇంటి పేర్లు కూడా ఈ తోనే ప్రారంభం కావడం గమనార్హం. దీంతో ఓట్లు ఎక్కడ చీలిపోతాయోనన్న ఆందోళన ఈటల అభిమానుల్లో మొదలైంది. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి ఇమ్మడి రాజేందర్, న్యూ ఇండియా పార్టీ నుండి ఈసంపల్లి రాజేందర్, ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ నుండి ఇప్పలపల్లి రాజేందర్ ఉన్నారు. వీరు ముగ్గురు నామినేషన్ల చివరి రోజు అంటే నిన్ననే నామినేషన్లు వేశారు. బ్యాలట్ పేపర్ పై వరుసగా నాలుగు ఇ రాజేందర్ ల పేర్లు ఉండటంతో పాటు ఈటల రాజేందర్ ఎన్నికల గుర్తు కమలం పోలిన గుర్తులు వారికి కేటాయింపు జరిగితే గ్రామీణ ప్రాంత ఓటర్లు కన్ఫూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ ఎత్తుగడలో భాగంగా వేసిన ఈ స్ట్రాటజీ వర్క్ అవుట్ అవుతుందో లేదో తెలుసుకోవాలంటే నవంబర్ 2వ తేదీ వరకూ ఆగాల్సిందే.