టాలీవుడ్ లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ కి ఉన్నంత క్రేజ్ మరే యంగ్ హీరోకి లేదనే చెప్పాలి. పెళ్ళి చూపులు, గీత గోవిందం.. లాంటి సినిమాలు ఒకవైపు.. అర్జున్ రెడ్డి లాంటి సినిమా మరోవైపు.. ఎలాంటి జోనర్ అయినా విజయ్ కి సెట్ అయిపోతుంది.. అంతగా విజయ్ ఆ పాత్రలో ఇమిడిపోతున్నాడు. అర్జున్ రెడ్డి లాంటి కథలో.. ఆ పాత్రలో విజయ్ ని తప్ప ఇంకే హీరోని ఊహించడం కష్టం. అంతెందుకు ఇదే సినిమా బాలీవుడ్, కోలీవుడ్ లో తెరకెక్కింది. కాని విజయ్ మాదిరిగా ఎవరు చేయలేదు అన్న టాక్ వచ్చింది.
అయితే ఆ తర్వాత వచ్చిన గీతో గోవిందం సినిమాలో కంప్లీట్ క్లాస్ హీరోలా కనిపించి అందరినీ ఆశ్చర్యపరచాడు. ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరిన హీరోగా రికార్డ్ సాధించాడు. కాని మళ్ళీ విజయ్ కి ఒక భారీ హిట్ దక్కలేదు. ఒక సినిమా మద్యలోనే ఆగిపోయింది. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్స్ గా మిగిలాయి. ఇలాంటి సమయంలో ఇస్మార్ట్ శంకర్ తో కం బ్యాక్ అయిన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్.. విజయ్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.
యూనివర్సల్ కాన్సెప్ట్ తో నాలుగు భాషల్లో పాన్ ఇండియన్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు పూరి. బాలీవుడ్ మేకర్ కరణ్ జోహార్ ఈ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. పూరి, చార్మి కలిసి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్ కి జంటగా నటిస్తుంది. కాగా ఈ సినిమా తర్వాత విజయ్ ఏ సినిమా చేస్తాడు అన్న ఆలోచన అందరిలోను ఉంది. అయితే నిన్ను కోరి, మజిలీ చిత్రాలతో టాలీవుడ్ లో తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ నెక్స్ట్ సినిమా ఉండబోతుందట.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శివ నిర్వాణ తెరకెక్కించే సినిమా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో విజయ్ మేజర్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. అలాగే శివ నిర్వాణ మార్క్ బ్యూటి ఫుల్ లవ్ స్టోరీ కూడా ఉండబోతుందట. ఇక మేజర్ గా విజయ్ దేవరకొండ అనగానే ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపు అయిందని ఇలాంటి సినిమా కదా విజయ్ కి పడాల్సింది అని చెప్పుకుంటున్నారట. త్వరలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయని అంటున్నారు.