లంచ్ సమయానికి భారత్ 57/1

ఆస్ట్రేలియా- భారత్ మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఈ రోజిక్కడ ప్రారంభమైన మూడో మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి రోజు లంచ్ సమయానికి వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 37 పరుగులతోనూ, ఛటేశ్వర్ పుజారా పది పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు. మరో ఓపెనర్ హనుమ విహారి 8 పరుగులు చేసి కుమ్మిన్స్ బౌలింగ్ లో ఫించ్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సిరీస్ లో ఇప్పటి వరకూ జరిగిన రెండు టెస్టులలో ఇరు జట్లూ చెరో టెస్ట్ గెలిచిన సంగతి విదితమే.  ఆస్ట్రేలియాలో సిరీస్‌ మొదటి మ్యాచ్‌లోనే నెగ్గి రికార్డు సృష్టించిన కోహ్లీ సేన.. ఆ తర్వాత పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో దారుణంగా ఓడిపోయింది.. దీంతో 1-1తో ఇరు జట్లు సమంగా నిలిచిన వేళ మెల్‌బోర్న్‌ బాక్సింగ్‌ డే టెస్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ టెస్టులో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకునే ఆశలను సజీవంగా ఉంచుకోవాలని ఇరు జట్లూ కోరుకుంటున్నాయి.