ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడుగా అజయ్ బంగా నియమితులైయ్యారు. ప్రపంచ బ్యాంకు కు నాయకత్వం వహిస్తున్న తొలి భారతీయ అమెరికన్ గా ఆయన నిలిచారు. 25 మంది సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ బోర్డు బంగాను నాలుగు గంటల పాటు ఇంటర్వ్యూ చేసిన అనంతరం బ్యాంక్ అధ్యక్షుడుగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది. అజయ్ బంగా సారధ్యంలో పని చేసేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామని ఎగ్జిక్యూటివ్ బోర్డు తెలిపింది. అభివృద్ధి చెందతున్న దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించే లక్ష్యంతో ప్రపంచ బ్యాంక్ లక్ష్యాలను బంగా నెరవేరుస్తారని అశిస్తున్నామని ఎగ్జిక్యూటివ్ బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది.

ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడుగా ఉన్న డేవిడ్ మాల్సాస్ జూన్ 1 వరకూ ఆ పదవిలో కొనసాగనున్నారు. జూన్ 2 నుండి అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఈ పదవిలో అయిదేళ్ల పాటు కొనసాగుతారు. బంగా ప్రస్తుతం అనరల్ అట్లాంటిక్ కంపెనీ వైస్ చైర్మన్ గా ఉన్నారు. గతంలో మాస్టర్ ప్రెసిడెంట్, సీఈఓ గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అజయ్ బంగాను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవికి నామినేట్ చేశారు.
63 సంవత్సరాల అజయ్ బంగా మహారాష్ట్రలోని పుణెలో జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నారు. విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన తర్వాత అజయ్ బంగా నెస్ట్లె ఇండియాలో చేరారు. అనంతరం సిటి బ్యాంక్ లో జాయిన్ అయ్యారు. 1996 లో అమెరికా వెళ్లిపోయారు. 2016 లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించింది. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడుగా అజయ్ బంగా ఎన్నికైనట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ప్రకటించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ లు ఆయనకు అభినందనలు తెలియజేశారు.