కరోనా టీకా కొనుగోళ్లలో మనమే ఫస్ట్..! భారీగా టీకాలు కొనుగోలు చేసిన ఇండియా..!!

 

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తన పంజా విసురుతూనే ఉంది. ఈ మహమ్మారికి ఆడ్డుకట్ట వేసేందుకు భారత్ గట్టి వ్యూహాన్ని రచించింది. కోవిద్-19 వైరస్ ని కట్టడి చేసెందుకు అవసరమయ్యే టీకా డోసులను సొంతం చేసుకునే విషయంలో భారత్ అతి పెద్ద కొనుగోలుదారుగా అవతరించింది. ఇప్పటివరకు 1600 మిలియన్ల టీకా డోసులను కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకుందని యూఎస్‌కు చెందిన డ్యూక్ విశ్వవిద్యాలయం విడుదల చేసిన ‘లాంచ్‌ అండ్ స్కేల్ స్పీడ్‌ మీటర్’ నివేదిక వెల్లడిస్తోంది.దీనితో కరోనా వ్యాక్సిన్ బుకింగ్ విషయంలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఆ తరువాతి స్థానంలో యూరోపియన్ యూనియన్ నిలవగా, 1000 మిలియన్ల డోసులతో అమెరికా మూడో స్థానంలో ఉందని తెలిపింది. టీకా కొనుగోళ్ల విషయంలో వివిధ దేశాలు ఎదుర్కొనే సవాళ్లను గుర్తించే లక్ష్యంతో నవంబర్‌ 30వరకు లభ్యమైన టీకా సేకరణ, తయారీకి సంబంధించిన సమాచారాన్ని ఈ నివేదిక పేర్కొంది. వ్యాక్సిన్ సేకరణ యొక్క సామర్థ్యాన్ని గుర్తించడానికి మరియు గ్లోబల్ ఈక్విటీ సవాళ్లను బాగా అర్థం చేసుకోవడానికి, నార్త్ కరోలినాకు చెందిన విశ్వవిద్యాలయం కోవిడ్ -19 వ్యాక్సిన్ టీకాలను మరియు స్థితిని గుర్తించడానికి పరిశోధనలు నిర్వహించింది.ఉత్పాదక ఒప్పందాలలో భాగంగా ప్రముఖ టీకా సంస్థలతో భారతదేశం మరియు బ్రెజిల్ వంటి ఉత్పాదక సామర్థ్యం ఉన్న దేశాలు ముందస్తుగా టీకాలను సేకరించే ఒప్పందాలు చేసుకోవడంలో విజయవంతమయ్యాయని నివేదిక వెల్లడించింది. కాగా, జపాన్, కెనడా, యూకే వంటి దేశాలు ఇప్పటివరకు 400 మిలియన్ల కంటే తక్కువ టీకా డోసులనే కొనుగోలు చేశాయని తెలిపింది.

 

covid-19-vaccine

ప్రపంచ దేశాలన్నీ టీకాల కొనుగోళ్ల కోసం ఒప్పందాలు చేసుకుంటున్నప్పటికీ..ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ టీకా లభించడానికి 2023 లేక 2024 వరకు పట్టొచ్చని ఆ నివేదిక అంచనావేసింది. కాగా, ఎక్కువ ఆదాయం కలిగిన దేశాలు 3.8 బిలియన్ల డోసులను సొంతం చేసుకోగా, మధ్యస్థ ఆదాయం కల్గిన దేశాలు 829 మిలియన్ మోతాదులను కలిగి ఉండగా, తక్కువ ఆదాయ దేశాలు 1.7 బిలియన్ మోతాదులకు పైగా వ్యాక్సిన్ డోసులను కొనుగోలు చేశాయని అధ్యయనం వెల్లడిస్తోంది. పెట్టుబడి సామర్థ్యం, కొనుగోలు శక్తి కారణంగా సంపన్న దేశాలు టీకాను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసుకొనే విషయంలో ముందంజలో ఉన్నాయని అభిప్రాయపడింది. పెద్ద మొత్తంలో ప్రజా నిధులను పెట్టుబడి పెట్టడం ద్వారా మరియు వ్యాక్సిన్ సంస్థల పోర్ట్‌ఫోలియోలో పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకోవడానికి పరపతి, కొనుగోలు శక్తి ద్వారా కొనుగోళ్లను చేయగలిగాయని అధ్యయనం పేర్కొంది.