భారత్ స్పందన తీవ్రంగా ఉంటుంది : ట్రంప్

వాషింగ్టన్:  భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పుల్వామా ఉగ్రదాడి తరువాత చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్ ట్రంప్ అభిప్రాయపడ్డారు.

పిటిఐ న్యూస్ ఎజన్సీ తెలిపిన సమాచారం ప్రకారం..40మంది జవాన్‌లను కోల్పోయిన భారత్..ఏదో ఒకటి చేయాలన్న యోచనలో ఉందని ట్రంప్ అన్నారు.

కాశ్మీర్ లోయలో పరిస్థితులు ఆందోళన కల్గిస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు.

ఉద్రిక్త పరిస్థితులకు రెండు దేశాలు స్వస్తి పలకాలని ట్రంప్ సూచించారు.  ఉద్రిక్త పరిస్థితులు నివారించడానికి రెండు దేశాలతో చర్చలు జరుపుతున్నామని  ట్రంప్ తెలిపారు.

భారత్, పాక్ మధ్య చాలా సమస్యలు ఉన్నాయని ట్రంప్ అన్నారు.  సమస్యలను చాలా సున్నితంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ట్రంప్ చెప్పారు.

పాక్‌కు ప్రతి ఏటా ఇస్తున్న 1.3 బిలియన్ అమెరికన్ డాలర్లను నిలిపివేశామని ట్రంప్ తెలిపారు. అమెరికాతో ఆ దేశం సహకరించకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ వెల్లడించారు.

పుల్వామా ఉగ్రదాడి వెనుక పాక్ ప్రభుత్వ హస్తం ఉందని భారత్ ఆరోపిస్తోంది. అంతర్జాతీయ వేదికపై పాక్‌ను ఏకాకి చేయాలని భారత్ నిర్ణయించుకుంది. భద్రతా మండలిలోనూ పాక్‌ను దోషిగా చూపడంలో సఫలమైంది.

భారత్ ఆరోపణలను పాక్ ప్రభుత్వం ఖండిస్తోంది. ఆధారాలు లేకుండా అభాండాలు వేస్తున్నారంటూ పాక్ ప్రభుత్వం పేర్కొంటోంది.