పోస్టాఫీసుల్లో మనకు అనేక రకాల సేవింగ్స్ స్కీమ్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) స్కీం కూడా ఒకటి. ఇందులో మనం పెట్టే డబ్బుకు 5.8 శాతం వడ్డీ ఇస్తారు. ఇది 3 నెలలకు ఒకసారి మన ఆర్డీ అకౌంట్లో జమ అవుతుంది. ఇక పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్లో డబ్బులు నెల నెలా పొదుపు చేయడం ద్వారా చక్కని లాభాలను పొందవచ్చు. దీనికి నెలకు కనీసం రూ.100 నుంచి పొదుపు చేయవచ్చు. గరిష్టంగా లిమిట్ అంటూ ఏమీ లేదు. ఎంతైనా ఆర్డీలో జమ చేయవచ్చు.
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజింట్ అకౌంట్లో రోజుకు రూ.50 చొప్పున నెలకు రూ.1500 పెడితే 5 ఏళ్ల కాలానికి గాను అది రూ.1.05 లక్షలు అవుతుంది. అదే 10 సంవత్సరాలకు రూ.2.75 లక్షలు అవుతుంది. 15 ఏళ్లకు ఏకంగా రూ.4.3 లక్షలు వస్తాయి. పోస్టాఫీస్ ఆర్డీ అకౌంట్‌కు 5 ఏళ్లకు మెచూరిటీ వస్తుంది. తరువాత డబ్బు తీసుకోవచ్చు. లేదా అదే అకౌంట్‌ను మళ్లీ 5 ఏళ్ల చొప్పున పొడిగిస్తూ వెళ్లవచ్చు. ఇలా ఒక ఆర్డీ అకౌంట్లో 15 ఏళ్ల వరకు డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. ఆ తరువాత పెద్ద మొత్తంలో సొమ్ము లభిస్తుంది.
ఇక కరోనా లాక్డౌన్ కారణంగా మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఆర్డీ అకౌంట్లలో నగదు జమ చేయని వారి కోసం జూలై 31వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఆలోపు ఆయా అకౌంట్లలో డబ్బులు జమ చేస్తే తిరిగి ఆ అకౌంట్లను కొనసాగించవచ్చు.