BJP : హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సిట్టింగ్ స్థానం కోల్పోవడంతో బీజేపీ లో నిరాశ చోటు చేసుకుంది. దుబ్బాక గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల ఫలితాలతో మంచి ఊపుమీద ఉన్న బిజెపి ఈ ఎన్నికల్లో కూడా సునాయాసంగా విజయం సాధిస్తామన్న ధీమాతో ఉన్న నాయకులకు ఒక్కసారిగా ఎదురు దెబ్బ తగలడంతో కంగుతిన్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో బలంగా ఉన్న పార్టీ ఈ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతోంది. సీనియర్ నాయకుడు, అడ్వకేట్, పలు ఎన్నికల్లో పోటీ చేసి అందరితో మంచి సంబంధాలున్న ఎన్. రాంచంద్రరావు ఓటమి చెందడంతో పార్టీలో కలవరం సృష్టిస్తోంది. రెండేళ్లపాటు పార్టీ నగర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన రాంచందర్‌రావు ఓటమిని కార్యకర్తలు, నాయకులు విశ్లేషించుకుంటున్నారు.

BJP : ఓవర్ కాన్ఫిడెన్సే ఓటమిపాలు చేసిందా?
టీఆర్‌ఎస్ ప్రభంజనం ఉన్న సమయంలోనే గత ఎమ్మెల్సీ ఎన్నికలలో సునాయసంగా ఈ సీటును దక్కించుకున్న బీజేపీ తాజా ఎన్నికల్లో ఇంకా ఎక్కువ మెజారిటీతో విజయం సాధిస్తామన్న ధీమాతో బరిలో దిగింది. ఈ మితిమిరిన ఆత్మవిశ్వాసం దెబ్బతీసిందని కొందరు భావిస్తున్నారు. ప్రత్యర్థులతో సమానంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పని చేయడంలో విఫలమయ్యారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ప్రజల్లో పార్టీకి ఆదరణ ఉందనే ధీమాతో కిందిస్థాయిలో పని చేయడంలో వెనుకబడ్డారనే వాదన వినిపిస్తోంది.
సాధారణంగా అభ్యర్థిని ప్రకటించకముందే పార్టీ కార్యకర్తలు తమ పరిధిలో ఓటర్ల వద్దకు రెండు, మూడుసార్లు వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించి, అక్కడ ఎంత మంది ఓటర్లు ఉన్నారో నమోదు చేసుకుంటారు. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని నాయకులు పేర్కొన్నారు.కొత్త తరం రాకతో.. బీజేపీలోకి ప్రస్తుతం కొత్తతరం వస్తోంది. పలు పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు వచ్చి చేరుతున్నారు. దీంతో సీనియర్ నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు లేకుండా పోయిందని పలువురు వాపోతున్నారు. తమను పట్టించుకోవడం లేదని అంటున్నారు. పార్టీ పటిష్టత కోసం పని చేసిన తాము తెరమరుగున పడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీనియర్లు చిర్రుబుర్రు!
గ్రేటర్ ఎన్నికలలో సీనియర్లకు టికెట్లు ఇవ్వకుండా, ఇటీవల పార్టీలో చేరిన వారికి ఇవ్వడంతో కార్యకర్తలో అసంతృప్తి చోటు చేసుకుందని అంటున్నారు. కొత్త ఓటర్ల నమోదు ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు, నాయకులు పట్టభద్రుల ఓటర్ల నమోదు విషయంలో మొదటి నుంచి విస్తృతంగా కృషి చేశారని, ఈ విషయంలో బీజేపీ నాయకులు కొంత వెనుకపడ్డారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
BJP : కన్వీనర్ లేకపోవడం పెద్ద మైనస్!
బీజేపీ నగరాన్ని నాలుగు జిల్లాలుగా విభజించి, బాధ్యతలు అప్పగించడంతో వారి మధ్య సమన్వయం లోపిస్తోందని సీనియర్ నాయకులు అంటున్నారు. గతంలో నగర అధ్యక్షుడిగా ఒక్కరే ఉండటంతో పార్టీ మొత్తాన్ని ఏకతాటిపై నడిపే అవకాశం ఉండేదని, కార్యకర్తలు, నాయకుల మధ్య సంబంధాలు ఉండేవని అంటున్నారు. ప్రస్తుతం అవి కొరవడ్డాయని అంటున్నారు. జిల్లాలుగా విభజించినా, నగరం మొత్తానికి ఒక కన్వీనర్‌ను నియమించి, పర్యవేక్షించకపోవడం వల్ల కూడా పార్టీకి నష్టం జరిగిందని అంటున్నారు.
పెరిగిన ధరల ఎఫెక్ట్!
ఇటీవల పెరిగిన ధరలు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రభావం చూపినట్లు భావిస్తున్నారు. పెట్రోల్ ధర దాదాపు రూ. వందకు చేరువలో ఉంది. నిత్యావసరాల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. ఇవి సామాన్యులతోపాటు పట్టభద్రులనూ ఆగ్రహానికి గురి చేశాయని భావిస్తున్నారు.మొత్తం మీద బీజేపీ ఈ ఫలితంపై అంతర్మథనంలో పడింది.