TRS: మెచ్చాను తెచ్చినందుకు మెచ్చి సండ్రకు మంత్రి పదవి ఇవ్వనున్న గులాబీ బాస్?

Share

TRS: టీఆర్ఎస్‌ అధిష్టానం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ అయింది. టీటీడీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేసే ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. ఇందుకు కానుకగా సండ్ర వెంకటవీరయ్యను క్యాబినెట్లోకి కెసిఆర్ తీసుకోబోతున్నారన్న ప్రచారం మొదలైంది.తెలుగుదేశం ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసిన తర్వాత మళ్లీ క్యాబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. కొందరికి ఉద్వాసన పలికి కొత్త వారిని మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. అందులో ప్రధానంగా ఖమ్మం జిల్లాకు చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేరు వినిపిస్తోంది. టీడీఎల్పీ విలీనం తర్వాత సండ్రను క్యాబినెట్‌లోకి తీసుకుంటారన్న ప్రచారం మరింత ఊపందుకుంది. ప్రస్తుత ఖ‌మ్మం జిల్లా నేత‌ల్లో సండ్ర వెంకట వీరయ్య నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ నుంచే వ‌రుస‌గా మూడు సార్లు విజ‌యం సాధించారు. అంతకుముందు సీపీఎం నుంచి ఒకసారి శాసనసభకు ఎంపికయ్యారు. వివాదాలకు దూరంగా ఉండే ఎమ్మెల్యేగా జిల్లాలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

అంతకుముందేమి జరిగిందంటే?

టీడీపీని ఖతం చేయాలని కసితో..!2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్.. తెలంగాణలో టీడీపీని ఖతం చేసే పనిని కసితో చేశారు. అప్పుడు సైకిల్ పార్టీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలను పలువురు ఎమ్మెల్సీలను కారెక్కించారు. అయినా అప్పుడు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, రేవంత్‌రెడ్డి మాత్రం పార్టీ మారకుండా టీడీపీలో ఉన్నారు. అనంతర రాజకీయ పరిణామాల్లో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు.
అయినప్పటికీ సండ్ర మాత్రం టీడీపీని వీడలేదు. అయితే మొదటి దఫా ప్రభుత్వంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల్లో తలసానికి మంత్రి పదవి లభించింది.

మళ్లీ వలవిసిరిన కెసిఆర్!

ఇక 2018 ఎన్నికల్లో టీడీపీ చిరకాల రాజకీయ శత్రువు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా.. కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఏపీ సరిహద్దులోని అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి మెచ్చా నాగేశ్వర్‌రావు‌, సత్తుప‌ల్లి నియోజకవర్గం నుంచి సండ్ర వెంకట వీరయ్య గెలుపొందారు.ఇక అదే సమయంలో తెలంగాణ శాసనసభలో టీడీపీ ప్రాతినిధ్యం లేకుండా చేయాలని గులాబీ పెద్దలు భావించారు. అందులో భాగంగా ఆ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు.గులాబీ ఆకర్ష్‌కు సండ్ర చిక్కినా, మెచ్చా మాత్రం టీడీపీని వీడేందుకు ససేమిరా అన్నారు. దాంతో మెచ్చాను మెప్పించి రప్పించే టాస్క్‌ను సండ్రకు టీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ అప్పగించింది. ఆయన్ను తీసుకువచ్చి టీడీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేస్తే సండ్రకు మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు కూడా అప్పట్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ పని పూర్తయిపోయిన౦దున సండ్ర వెంకట వీరయ్యకు తప్పనిసరిగా మంత్రిపదవి లభించబోతోందని చెప్తున్నారు.


Share

Related posts

వీర్రాజు ‘కాటమరాయుడు’కాపురం ఎలా ఉంటుందో ?

Yandamuri

నేను లేఖే రాయలేదు’

somaraju sharma

Most eligible bachelor : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కి ఆ ఒక్కటే పెద్ద ప్లస్ పాయింట్ కాబోతోంది..!

GRK