టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు ఎక్కువగా సంగీతం అందిస్తున్న వారిలో థమన్, దేవిశ్రీ ప్రసాద్ లు ముందు వరుసలో ఉన్నారన్న విషయం తెలిసిందే. కాగా ఈ మ్యూజిక్ డైరెక్టర్లు అందించే ట్యూన్స్‌లో అప్పుడప్పుడు కాపీ ట్యూన్స్ ఉంటున్నాయన్న విమర్శలున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ విమర్శను ఎదుర్కొంటున్న సంగీత దర్శకుల్లో థమన్ పేరు బాగా వినిపిస్తోంది. థమన్ సంగీతం అందించిన ప్రతి సినిమాకు ఇలాంటి విమర్శలు వ్యక్తం కాకపోయినా థమన్ కాపీ క్యాట్ అని చాలా సందర్భాల్లో నెటిజన్లు ఆయనను ట్రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇకపోతే కిక్ సినిమాతో తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించిన థమన్ ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. అదీగాక వేగంగా ట్యూన్లు ఇవ్వడంతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఇస్తాడనే మంచి పేరు థమన్ కు ఉంది. అయితే థమన్ సంగీతం అందించిన పాటల్లో కొన్ని పాటలు కాపీ అని గతంలో విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతున్న క్రాక్ సినిమాలో బల్లేగా తగిలావే బంగారం పాటను చిత్ర బృందం తాజాగా విడుదల చేయగా ఈ సాంగ్ విన్న నెటిజన్లు ఒరిజినల్ ట్యూన్ అయిన సెల్వా ఎల్ నియాన్ అనే లాటిన్ ట్యూన్ ను షేర్ చేసి థమన్ ను ట్రోల్ చేస్తున్నారు.
అంతే కాకుండా సమయం చిక్కితే చాలు నెటిజన్స్ బాగా కామెంట్స్ తో థమన్ ని వదలకుండా ఆడేసుకుంటారని టాక్ మొదలైంది. అయితే గతంలో సినిమా దర్శక, నిర్మాతల కోరిక మేరకే కొన్నిసార్లు అలా చేయాల్సి వచ్చిందని థమన్ వివరణ ఇచ్చారు. అయిన గానీ కొన్ని రోజుల క్రితం థమన్ సంగీతం అందించిన ‘వి’ సినిమా విషయంలో సైతం ఇలాంటి విమర్శలే వినిపించాయి. ఈ విషయంలో కూడా ఆ చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సౌండ్స్ సేమ్ అనిపించాయని… కానీ సరైన సంగీత పరిజ్ఞానం లేకపోవడం వల్ల చాలామంది కాపీ అని భావిస్తున్నారని వెల్లడించారు.
ఇక సోషల్ మీడియాలో మాత్రం మరోసారి అడ్డంగా దొరికిపోయావ్ థమన్ అంటూ మీమ్స్ షేర్ చేస్తున్నారట నెటిజన్లు. మరి క్రాక్ చిత్ర విషయంలో వస్తున్న కామెంట్స్ పట్ల థమన్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. కాగా థమన్ ప్రస్తుతం బిజియస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో పాటు మరికొన్ని సినిమాలు చేతిలో ఉన్నాయి.