టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి 15 ఏళ్ళ సినిమా కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైన సినిమా అరుంధతి. ఈ సినిమా సృష్ఠించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. దర్శకుడిగా కోడి రామకృష్ణ, నిర్మాతగా శ్యాం ప్రసాద్ రెడ్డి, హీరోయిన్ గా అనుష్క కెరీర్ లో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిపోయో హిట్ ని అందుకున్నారు. ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగ రాయడమే కాదు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకి ఆ తర్వాత బాగా ఆదరణ దక్కడానికి ప్రధాన కారణం అయింది.
ఇంకా చెప్పాలంటే అనుష్క కెరీర్ అరుంధతికి ముందు.. అరుంధతికి తర్వాత అన్నట్టుగా ఈ సినిమా అనుష్క మీద ప్రభావం చూపించింది. కోడి రామకృష్ణ ఈ సినిమాని ఓ విసువల్ వండర్ గా సిల్వర్ స్క్రీన్ మీద ఆవిష్కరించాడు. అయితే అన్ని భాషల్లో ఇలా రిలీజైన సినిమా అలా వేరే భాషల్లో రీమేక్ అవుతుంటే బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామీని సృష్ఠించిన అరుంధతి సినిమా మాత్రం ఇంతవరకు వేరే భాషలో రీమేక్ కాకపోవడం ఆశ్చర్యకరం.
ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కి భారీ విఎఫ్ఎక్స్.. సినిమాటోగ్రఫీ.. సంగీత దర్శకుడు కోటి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. కథ, కథనం, సోనూసూద్ నటన.. ఇలా అన్నీ అరుంధతి సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఇండస్ట్రీలో ఉన్న విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను గతంలో ఒకసారి బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారన్న వార్తలు వినిపించాయి.
కానీ ఎందుకనో మళ్ళీ అక్కడ ఈ సినిమా గురించి ఆలోచించిన మేకర్స్ ఎవరూ లేరు. అయితే తాజాగా అరుంధతి రీమేక్ హక్కులను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ దక్కించుకున్నారట. త్వరలోనే ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తారట. బాలీవుడ్ లో అల్లు అరవింద్ తో పాటు ఫాంటమ్ ఫిలిమ్స్ అండ్ బ్రాట్ ఫిలిమ్స్ మధు మంతెన కలిసి నిర్మించనున్నారని తెలుస్తుంది. అరుంధతి పాత్రలో స్టార్ హీరోయిన్ దీపిక పదుకోనె నటించనుందని సమాచారం.