అమెరికాలో జరిగిన ఒక సంఘటన ఇండియాలో ఒక ప్రముఖ ఫేస్ క్రీమ్ పేరు మార్పునకు కారణమైంది .అమెరికాలో నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తి పోలీసు అధికారి డెరెక్ చావిన్ కారణంగా ఊపిరి ఆడక మరణించాడు.
నల్లజాతీయుల్లో వివక్ష పై నిరసనలు తీవ్ర రూపం దాల్చటమే కాదు..ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఇలాంటివేళ.. తెల్ల రంగు మీద కొత్త చర్చ మొదలైంది.ఈ పరిణామాల నేపథ్యంలో కంపెనీ తనకుతానే ఫెయిర్ అనే పేరును తొలగిస్తున్నట్లుగా యూనీ లివర్ ప్రకటించింది. తన బ్రాండ్ నేమ్ విషయంలో యూనీ లివర్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.
సరిగ్గా ఇదే పాయింట్ మీద దశాబ్దాల తరబడి అమ్మకాలు జరుపుతున్న ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ బ్రాండ్ కొనసాగింపుపై యూనీ లివర్ ఆలోచనలో పడింది. కాలానికి తగ్గట్లు.. తమ పేరును మార్చుకోకపోతే.. పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందన్న విషయాన్ని గ్రహించి.. ఎవరో వేలెత్తి చూపించేందుకు భిన్నంగా తమకు తాముగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు.
ఇందులో ఫెయిర్ అనే పదానికి కాలం చెల్లిందన్నట్లుగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన కంపెనీ.. తాజాగా తన ఉత్పత్తికి కొత్త పేరు పెట్టేసింది. అందానికి నిర్వచనం తెలుపు ఎంత మాత్రం కాదన్న విషయాన్ని స్పష్టం చేసేలా తాజా పేరు ఉండటం గమనార్హం. ఫెయిర్ అండ్ లవ్లీ స్థానంలో గ్లో అండ్ లవ్లీగా పేర్కొంటూ తన బ్రాండ్ కు కొత్త పేరును డిసైడ్ చేసింది. దక్షిణాసియాలో విపరీతమైన అమ్మకాలు సాగించే ఈ క్రీమ్.. పేరు మార్చుకున్న తర్వాత దీని ఫేట్ ఎలా ఉంటుందో చూడాలి. కార్పొరేట్ రంగంలో ఇప్పుడీ విషయం మీద పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమవుతోంది.
అప్పుడెప్పుడో బామ్మల జమానా నుంచి ఇప్పటి మిలీనియం జమానా వరకు అందరికి సుపరిచితమైన బ్రాండ్లలో ఒకటి ఫెయిర్ అండ్ లవ్లీ. ఈ క్రీమ్ ను వాడే వారే కాదు.. వాడని వారు అదేపనిగా మాట్లాడుకోవటం కనిపిస్తుంది. అలాంటి ఈ బ్రాండ్ పేరును తాజాగా మారుస్తూ.. సదరు ఉత్పత్తి సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ తీసుకున్న నిర్ణయానికి ప్రజా స్పందన ఎలా ఉంటుందో చూడాలి