అనితర సాధ్యమైన రీతిలో జగన్ భజన ! జనసేన ఎమ్మెల్యే రాపాక ముందు ఎవరైనా బలాదూర్ !!

ఒకవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాలికి బలపం కట్టుకు తిరుగుతుండగా స్వంత వైసిపి ఎమ్మెల్యేలు కూడా పొగడని రీతిలో జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ మరోసారి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నాలుగో రోజు చర్చలో భాగంగా ప్రభుత్వ పథకాలపై ప్రసంగించిన రాపాక.. సీఎం జగన్‌ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందంటూ కొనియాడారు. ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ప్రజా సంక్షేమ నిర్ణయాలను తీసుకుని చిన్న వయసులోనే జగన్ అమలు చేస్తున్నారని రాపాక అన్నారు.ఈ క్రమంలోనే జగన్.. ప్రజల గుండెల్లో చిరస్మరణీమైన స్థానం దక్కించుకున్నారని రాపాక చెప్పుకొచ్చారు. ప్రజల శ్రేయస్సు గురించి ఇంతగా పరితపించే సీఎంను తానెప్పుడూ చూడలేదని, తాను బ్రతికున్నంత వరకు వైఎస్‌ జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన జోస్యం చెప్పారు.

సీఎం జగన్‌ లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారని, సచివాలయం ద్వారా ప్రతి గ్రామంలో 30 నుంచి 40 మంది వాలంటీర్లను నియమించడం గొప్ప విషయం అని అన్నారు.ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే ఎన్నో హామీలను జగన్ అమలు చేశారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని అన్నారు. ఆయన నాయకుడిగా ఉన్న అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. అప్పట్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన స్వర్ణ యుగంలా ఉండేదని, వైఎస్‌ జగన్‌ అదే దారిలో నడుస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.

జగన్‌లాంటి నాయకుడు పదికాలాల పాటు సీఎంగా ఉండాలని, దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నారని, దేశమే ఆశ్చర్యపోయే విధంగా ప్రతినెలా పెన్షన్‌ ఇస్తున్నారని, 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ, 14 ఏళ్లపాటు సీఎంగా చేసిన చంద్రబాబు ఏనాడు కూడా ఇలా ప్రజా సంక్షేమం కోసం ఆలోచన చేయలేదని రాపాక చెప్పారు.అయితే ఇంత జరుగుతున్నా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యే మీద ఎలాంటి క్రమశిక్షణ చర్యలకు చర్యలకు సిద్ధపడకపోవటం ఆ పార్టీ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది.పశ్చిమగోదావరి జిల్లాలో రఘురామకృష్ణ ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసిపికి తలనొప్పిగా మారితే తూర్పుగోదావరి జిల్లాలో రాపాక వరప్రసాద్ జనసేనకు ఇంతకంటే పెద్ద గుదిబండగా తయారయ్యారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.