‘ఉచిత పథకాలు అనుచితం’

విజయవాడ, ఫిబ్రవరి 23: దేశంలో అధికార వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. విజయవాడలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ ఐక్యత దెబ్బతినకుండా రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలనీ, స్థానిక అంశాల్లో కేంద్రం నిర్ణయం చేయక్కర్లేదని జయప్రకాష్ నారాయణ అన్నారు. అధికారం జనాలకు చేరువ కావాల్సిన అవసరం ఉందన్నారు.

2019 ఎన్నికల్లో రాజకీయంగా పలు మార్పులు సంభవించనున్నాయని జయప్రకాష్ చెప్పారు. ప్రాంతీయ పార్టీల సహకారం లేకుండా కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని ఆయన అన్నారు.

ఎన్నికల్లో లబ్దిపొందేందుకు ఉచిత పథకాలు ప్రకటించడం సరికాదని ఆయన హితవు పలికారు. పదవుల కోసం ఎన్నికల్లో లోక్‌సత్తా పోటీ చేయదని ఆయన అన్నారు. ఉచిత పథకాలు ఇస్తేనే ప్రజల జీవితాలు మెరుగు పడవనీ పేర్కొంటూ, ఎన్నికల తాయిలాలు ప్రకటించడం లోక్‌సత్తా విరుద్ధమని ఆయన అన్నారు.

సమాజంలో ప్రతి ఒక్కరికి సమన్యాయం అందితేనే అది ప్రజాస్వామ్యం అవుతుందని పేర్కొన్నారు.

బడ్జెట్‌లో 15శాతం ప్రజల కోసం కేటాయించాలని, అది ప్రజలకు నేరుగా అందేలా చేయాలని జయప్రకాష్ నారాయణ సూచించారు.