జేడీ లక్ష్మీనారాయణ అసలు స్వరూపం వేరు..అవినీతికి ఆయనేం అతీతుడు కాదన్న వైసీపీ ఎమ్మెల్సీ!

వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అత్యంత అవినీతిపరుడని మాజీఎంపీ, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ పి. రవీంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

జేడీ లక్ష్మీనారాయణ చెప్పేదొకటి చేసేదొకటి… ఆయన రూపం మరొకటి …మోసగాడు మంచివాడు కాదు ..అంటూ రవీంద్రబాబు ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.జగన్ మీద కేసులు పెట్టారు కాబట్టి తాను లక్ష్మీనారాయణపై కోపంతో ఈ ఆరోపణలు చెయ్యడం లేదని, తాను కూడా ఆయనకు ప్రభుత్వ సర్వీసులో సహచరుడినే అని రవీంద్రబాబు తెలిపారు. ఆ పరిచయాలను ఉపయోగించుకొని తాను జేడీ లక్ష్మినారాయణ చిట్టాను బయటకు తీయగా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయన్నారు.మహారాష్ట్ర క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఆ రాష్ట్రంలో అత్యంత అసమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారని ఎస్పీగా ఏ ఒక్క జిల్లాలో కూడా ఆయన ఏడాది కాలం కూడా పనిచేయలేదు చెప్పారు.చివరకు ఒక జిల్లాలో లక్ష్మీనారాయణ కలెక్టర్ కాలర్ పట్టుకున్న విషయం కూడా రికార్డుల్లో ఉందన్నారు.

ఆయన పర్ఫామెన్స్ వరస్ట్ గా ఉండటంతో మహారాష్ట్రలో ఆయనను పోలీసుశాఖలో లూప్లైన్లో వేశారన్నారు.ఈ తరుణంలో అప్పటికే జగన్ అంటే భయపడిపోతున్న సోనియాగాంధీ ,చంద్రబాబు తదితరులు లక్ష్మీనారాయణను ఎంపిక చేసుకొని సీబీఐకి తెచ్చారన్నారు.జగన్ ను క్రష్ చేసే పనిని ఆయనకు అప్పగించారన్నారు.పవర్ లాబీతో పాటు మీడియా కూడా మద్దతివ్వడంతో లక్ష్మీనారాయణ చెలరేగిపోయాడన్నారు.లక్ష్మీనారాయణ అవినీతిపరుడంటూ ఆయన ఒక సంఘటన చెప్పారు.మహారాష్ట్రలో పనిచేసినప్పుడు లక్ష్మీనారాయణకు ముంబయిలో పోలీస్ వెల్ఫేర్ హౌసింగ్ సొసైటీలో ఒక ఇల్లు ఉండేదని,దాన్ని అమ్మేసుకుని హైద్రాబాద్ శివార్లలో ఆయన స్థలం కొన్నాడని,కుంట స్థలాన్ని ఇరవై లక్షల రూపాయల చొప్పున కొన్నట్లు ఆయన తన ఆస్తుల పట్టికలో వెల్లడించాడని,అయితే తాను ఆరాతీస్తే ఆయనతో స్థలం ఉన్న ప్రాంతంలో కుంట ధర అప్పుడే రెండు కోట్ల రూపాయల వరకు ఉందన్నారు.

పోలీస్ హౌసింగ్ సొసైటీలో ఇల్లు అమ్ముకుంటే కోట్లు రావని..మరిఈ స్థలం కొనడానికి ఆయనకు అంత డబ్బెలా వచ్చిందన్నట్లుగా రవీంద్ర మాట్లాడారు.అయితే పోలీసు శాఖలోనూ సీబీఐలో పనిచేసినందువల్ల లక్ష్మీనారాయణ మనీ మేనేజ్ మెంట్ లో నిష్ణాతుడని,ఇలాంటివన్నీ కవర్ చేసుకోగలిగాడనీ రవీంద్ర వ్యాఖ్యానించారు. ఇవన్నీ తెలిశాక లక్ష్మీనారాయణ నిజస్వరూపం తనకు అర్థమైందని అందుకే మొన్న ఆయన విశాఖపట్నంలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు తాను ఆయనకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ప్రచారం చేశానని రవీంద్ర చెప్పారు.భవిష్యత్తులో కూడా లక్ష్మీనారాయణను వదిలిపెట్టబోనని వైసిపి ఎమ్మెల్యే రవీంద్ర చెప్పటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.