ఆ ఖైదీలను తరలించండి: జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం

 

జమ్ము జైళ్లలో ఉన్న ఏడుగురు పాకిస్థానీ ఖైదీలను ఢిల్లీలోని తిహార్‌ జైలుకు తరలించమని కోరుతూ జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసినది. స్థానిక ఖైదీలను వీరు ఉగ్రవాదంలో చేరేలా ప్రభావితం చేస్తున్నారని పిటిషన్ లో ఆరోపించినది.

‘ వేర్వేరు సంస్థలకు చెందిన ఉగ్రవాదులు జమ్ము జైల్లో ఉన్నారు. వీరు తోటి ఖైదీలకు ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోసి తమ వైపునకు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇక్కడి నుంచి వారిని తిహార్‌ జైలుకు తరలించాలి’ అని జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వ స్టాండింగ్‌ కౌన్సిల్‌ షోయబ్‌ అలం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తిహార్‌కు తరలించడం సాధ్యపడకపోతే.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే హరియాణా, పంజాబ్‌లోని జైళ్లకైనా పంపించాలని కోరారు.

జస్టిస్‌ ఎల్‌ఎన్‌ రావు, జస్టిస్‌ ఎం.ఆర్‌ షాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌‌పై విచారణ చేపట్టినది. నాలుగు వారాల్లోగా దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసినది. ఏడుగురు తీవ్రవాదులకు కూడా ఈ నోటీసు ప్రతులను అందజేయాలని సూచించినది.

పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజే, జమ్ము జైల్లో ఉంటున్న లష్కరే తొయిబా ఉగ్రవాది జాహిద్ ఫరూక్ ని వేరే జైలుకు తరలించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినది.