అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి మాజీ మంత్రి, ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్థన్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. బీజేపీకి రాజీనామా చేసిన గాలి జనార్థన్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీ ప్రకటన చేశారు. బీజేపీకి ఆర్ధిక శక్తిగా ఉండి బళ్లారి జిల్లాలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న గాలి జనార్థన్ రెడ్డి అనూహ్యంగా బీజేపీకి రాజీనామా చేసి సొంతంగా రాజకీయ పార్టీ పెట్టడం తీవ్ర సంచలనం అయ్యింది. గాలి జనార్థన్ రెడ్డి, ఆయన సోదరుడు గాలి కరుణాకర్ రెడ్డిలు గతంలో యడ్యూరప్ప కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. గాలి జనార్థన్ రెడ్డి మరో సోదరుడు సోమశేఖరరెడ్డి గతంలో పార్లమెంట్ సభ్యుడుగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం బళ్లారి సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2008, 2018 ఎన్నికల్లో ఆయన బళ్లారి ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్థన్ రెడ్డి జైలు జీవితం అనుభవించారు. ఆ కేసులో ఆయన ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు.

గాలి జనార్థన్ రెడ్డి ఆదివారం తన రాజకీయ పార్టీ ని ప్రకటించారు. ‘కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష’ పేరుతో రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్న గాలి జనార్థన్ రెడ్డి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయ పార్టీ స్థాపించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి ఇంటిని సందర్శిస్తానని చెప్పారు. రాజకీయ పార్టీలు రాష్ట్రంలోని ప్రజలను విభజించే పరిణామాల ద్వారా లబ్దిపొందాలని ప్రయత్నిస్తే అది కర్ణాటకలో సాధ్యం కాదని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఎల్లవేళలా ఐక్యంగానే ఉన్నారు, ఉంటారని తెలిపారు. బీజేపీ మంత్రి శ్రీరాములుతో విభేదాలు ఉన్నట్లుగా వస్తున్న ప్రచారాన్ని ఆయన కొట్టి పారేశారు. తనకు బీజేపీలో ఎవరితోనూ విభేదాలు లేవని తెలిపారు. శ్రీరాములు చిన్ననాటి నుండి తనకు ఆప్తమిత్రుడని, ఆయన మంచి అనుబంధం కొనసాగుతోందని అన్నారు.
అక్రమ మైనింగ్ ఆరోపణలపై గాలి జనార్దన్ రెడ్డి జైలుకు వెళ్లినప్పటి నుండి ఆయనకు బీజేపీ నేతలతో విభేదాలు ఉన్నట్లుగా ప్రచారాలు జరుగుతూనే తఉన్నాయి. కోట్లాది రూపాయల అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న గాలి జనార్థన్ రెడ్డి 2015 లో బెయిల్‌పై బయట కు వచ్చారు.