అనంతపురం జిల్లాలో కర్ణాటక అధికారుల బృందం పర్యటన..! ఎందుకంటే..?

 

ఏపీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వాలంటరీ వ్యవస్థ ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవస్థ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అవుతుంది. కర్ణాటక ప్రభుత్వం కూడా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను అమలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

ఈ క్రమంలో భాగంగా ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థను అధ్యయనం చేసేందుకు కర్ణాటక అధికారుల బృందం అనంతపురం జిల్లాలో పర్యటించింది. ఇద్దరు ఐఏఎస్ అధికారులు, మరో ఎనిమిది మంది ప్రభుత్వ అధికారులు అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం సోమందపల్లి గ్రామాల్లో పర్యటించారు. కర్ణాటక పంచాయతీరాజ్ కమిషనర్ ప్రియాంక మేరీ, మరో ఐఏఎస్ అధికారి బళ్లారి జిల్లా పరిషత్ ఆఫీసర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.ఆర్ నందిని, పంచాయతీ రాజ్ రిసోర్స్ సెంటర్ డైరెక్టర్ కే రేవన్న అప్ప, రిసోర్స్ సెంటర్ డైరెక్టర్ గణేష్ ప్రసాద్ లు గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. అనంతపురం జాయింట్ కలెక్టర్ ఏ సిరి వారికి గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు వివరించారు. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిన సాఫ్ట్ వేరు, పనితీరు తదితర విషయాలు తెలియజేశారు. అట్టడుగు లబ్ధిదారులకు ప్రభుత్వ సేవలు అందుతుండటం పట్ల ప్రసంగించారు.