రాజకీయ మాటల మాంత్రికుడు కేసీఆర్!ఏ ఒక్క పాయింట్ నూ వదల్లే!

నవరస నటనా సార్వభౌముడని సినీనటులను అంటుంటాం.కానీ శనివారం హైదరాబాద్లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తాను వారికి ఎవరికీ తీసిపోనని నిరూపించుకునేలా ప్రసంగించారు.

తన ప్రసంగంలో నవరసాలను ప్రదర్శించారు.బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమందా?అంటూ సెంటిమెంట్ పండించారు. హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసిన వరద సాయం కింద పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు అడిగితే పదమూడు రూపాయలు కూడా ఇవ్వని కేంద్ర మంత్రులు ఇతర నేతలు ఇపుడు వరదలా హైదరాబాదుకు వస్తున్నారని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తనకు ప్రధాన ప్రత్యర్థిగా తయారైన బీజేపీ మీద విమర్శల వర్షం కురిపించారు. హైద్రాబాదీలు భారతీయులు కాదా భారతదేశంలో లేరా అంటూ ఓటర్లలో ఉద్వేగ భావాన్ని రేపే ప్రయత్నం చేశారు.ముంబైని 10 రోజులకుపైగా వరద ముంచెత్తింది. చెన్నైని 21 రోజులకుపైగా వరద ముంచెత్తింది.ఢిల్లీ, అహ్మదాబాద్‌లకు కూడా వరద ముప్పు తప్పలేదు.హైదరాబాద్‌ నగరానికి వరద కష్టం వస్తే ప్రభుత్వం వెంటనే స్పందించింది.

మా ప్రజాప్రతినిధులు మంత్రులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు ప్రజలు పడుతున్న కష్టాలను చూసి నా కళ్లలో నీళ్లు తిరిగాయి అందుకనే వారికి పది వేల రూపాయలు ఇవ్వాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నా.బీజేపీ, కాంగ్రెస్‌లు పరిపాలించే ఏ నగరంలోనూ ఇలాఆర్థికసాయం అందించలేదు..అయినా కిరికిరి పెడుతున్నారు నాకొడుకులు.. బాధతో ఈ మాట అంటున్నా అని కేసీఆర్ చెప్పి ప్రజల నుండి సానుభూతి పొందే ప్రయత్నం సాగించారు. గత ఆరేళ్లుగా హైదరాబాద్‌లో శాంతిభద్రతలను పరిరక్షించాం.ముష్కరులు, రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాం.తలకుమాసినవాడి మాటలను పట్టించుకోను. హైదరాబాద్‌కు వెల్లువలా పరిశ్రమలు వస్తున్నాయి.

ఎన్నికల తర్వాత కూడా కేసీఆర్‌ ఉంటాడు. టీపాస్‌ కావాలా?, కర్ఫ్యూ పాస్‌ కావాలో? బిల్డర్లు ఆలోచించుకోవాలి అంటూ వ్యాపారులను ఆలోచనలో పడేశారు. హైదరాబాద్‌ నగరం, రాష్ట్రం అభివృద్ధే నా లక్ష్యం.హైదరాబాద్‌లో ఉన్న ప్రతి బిడ్డా.. మా బిడ్డే. ఎక్కడా కుల, మత, ప్రాంతీయ వివక్షలు లేకుండా ముందుకెళ్లామని చెబుతూ కేసీఆర్ ఓటర్లకు గాలం వేశారు. పనిలో పనిగా టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను ఆయన వివరించారు.హైదరాబాద్ నగరాభివృద్ధికి తమ వద్ద ఉన్న ప్రణాళికను వెల్లడించారు.రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ఓట్లేసి గెలిపించాలని కేసీఆర్ గ్రేటర్ హైద్రాబాద్ ప్రజలను కోరారు.మొత్తంగా చూస్తే కేసీఆర్ ఎన్నికల ప్రచారం ఎన్నికల ప్రచార ప్రసంగం నవరసాల మిళితంగా ఉందనడంలో సందేహం లేదు.