ప్రధాని మోడీతో కేసీఆర్ భేటీ నేడు

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో నేడు సమావేశం కానున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించి రెండో సారి తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కేసీఆర్ మోడీతో భేటీ కావడం ఇదే తొలిసారి అవుతుంది. జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెస్సేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కృషి చేస్తున్న కేసీఆర్ ఇప్పటికే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలతో భేటీ అయ్యారు.

వారితో దేశ రాజకీయ పరిస్థితులు, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. ఢిల్లీ చేరుకున్న ఆయన ఇక్కడ బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ తదితరులతో భేటీ అవ్వనున్నారు. కాగా తెలంగాణ  సీఎంగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కేసీఆర్ మర్యాదపూర్వకంగా మోడీతో భేటీ అవుతారు. కాగా ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలతో బిజీగా ఉన్న కేసీఆర్ మోడీతో భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.