క‌విత‌కు తీపిక‌బురు.. కేసీఆర్ క‌ల నెర‌వేరుతుంది

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ క‌ల నెర‌వేర‌నుంది. ఆయ‌న త‌న‌య‌, మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను క్రియాశీల రాజ‌కీయాల్లోకి తీసుకురావాల‌నే ఆలోచ‌న‌ల‌కు ఎదురైన అడ్డంకులు తొల‌గిపోనున్నాయి. cm kcr to become deputy prime minister of india

కేంద్ర ఎన్నికల సంఘం నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్‌9న ఎన్నిక, 12న ఫలితాలు వెలువ‌డ‌నున్నాయి. మాజీ ఎంపీ కవిత ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు.

కవిత ఎంట్రీతో…

నిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ త‌ర‌ఫున ఎమ్మెల్సీగా గెలిచిన భూపతిరెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల స‌మ‌యంలో కాంగ్రెస్‌లో చేరటంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. ఈ ఎన్నిక‌కు గతంలోనే నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ఈ ఉప ఎన్నిక బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు. కాంగ్రెస్‌ తరఫున అభ్యర్థిగా సుభాష్‌రెడ్డి బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్‌ తరఫున మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, బీజేపీ అభ్యర్థిగా పోతన్‌కర్‌ లక్ష్మీనారాయణ, బరిలో ఉన్నారు. అయితే, పోలింగ్ స‌మ‌యంలో కరోనాతో ఎన్నికను ఈసీ వాయిదా వేసింది.

క‌విత గెలుపు లాంచ‌న ప్రాయ‌మే

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అఖండ మెజార్టీతో విజయం సాధించనున్నారని జిల్లా రాజ‌కీయాల గురించి తెలిస‌న వారు అంచ‌నా వేస్తున్నారు. నిజామాబాద్ ,కామారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 824 మంది ఓటర్లుగా ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇందులో టీఆర్‌ఎస్ సంఖ్యా బలం 504 ఉండగా.. ఎంఐఎంకు చెందిన 28 మంది ఓటర్లు టీఆర్‌ఎస్‌కే మద్దతు పలుకుతారనేది తెలిసిన సంగ‌తే. 66 మంది స్వతంత్ర ఓటర్లు కూడా కవిత గెలుపు కోసం టీఆర్‌ఎస్‌కే ఓటు వేసేందుకు మేము సంసిద్ధంగా ఉన్నామని ఇది వరకే ప్రకటించారు. దీంతో టీఆర్‌ఎస్ సంఖ్యా బలం 598కి చేరింది.

కాంగ్రెస్, బీజేపీ… క‌రివేపాకు క‌థ‌

141 సంఖ్యాబలం ఉన్న కాంగ్రెస్ పార్టీ, 85 మంది ఓటర్ల బలమున్న బీజీపీ 598 సంఖ్యాబలం ఉన్న టీఆరెస్ తో పోటీ చేసి నిలిచి గెలుస్తుందా? అని జిల్లాలోని ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన వారు విశ్లేషిస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు దాదాపు 90శాతం ఓట్లు పడ్డ ఆశ్చర్యపోనవసరం లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే 598 మంది ప్రజాప్రతినిధుల బలం ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఇటీవ‌ల కొద్దిమంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు చేరారు. దీంతో ఆ రెండు పార్టీలు టీఆర్ఎస్‌కు పోటీ ఇవ్వ‌డం జ‌రిగే ప‌నేనా? అంటూ సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తంగా నిజామాబాద్ జిల్లా స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ కోటాలో కవిత గెలుపు లాంచ‌న‌ప్రాయ‌మేన‌ని, ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌ల నెర‌వేర‌నుంద‌ని విశ్లేషిస్తున్నారు.