మోదీని కెసిఆర్ ఎందుకు కలుస్తున్నట్లు!?

రెండవ సారి తెలంగాణా ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత కె చంద్రశేఖరరావు బుధవారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలువనుండటంతో వారి మధ్య ఏ విషయాలు చర్చకు వస్తాయి అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాబోయే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ ద్వారా దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి బీజేపీ, కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని అధికారంలోకి  తీసుకురావాలని కె చంద్రశేఖరరావు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

అందులో భాగంగా ఇటీవలే ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలను కలిసిన విషయం విదితమే. కెసీఆర్ ప్రధాన మంత్రిని కలవడంలో ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, కేవలం మర్యాద పూర్వకంగానే కలవనున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన తెలంగాణా ఎన్నికల సమయంలో జరిగిన సభల్లో ప్రధాని మోదీపై కెసీఆర్, కెసీఆర్ పై మోదీలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు.

మరో పక్క కెసీఆర్‌తో ప్రధాని మోదీకి రహస్య ఒప్పందం ఉందనీ, ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ పరోక్షంగా సహకరించారనీ టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. దేశంలో బీజెపీ యేతర పార్టీలను ఏకం చేసి జాతీయ పార్టీ కాంగ్రెస్ మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు  టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పావులు కదుపుతున్నారు. తెలంగాణా సీఎం కెసిఆర్ చంద్రబాబు ప్రయత్నాలకు గండి కట్టేందుకు ప్రయత్నిస్తున్నారనీ, ఇది బిజెపికి కాక ఎవరికి ఉపయోగపడుతుందనీ టిడిపి వారు ప్రశ్నిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు జాతీయ స్థాయిలో చక్రం తిప్పడానికి వ్యూహ ప్రతివ్యూహాలు సిద్దం చేసుకుంటున్న తరుణంలో  ముఖ్యమంత్రి  చంద్రశేఖరరావు ప్రధాని మోదీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంటున్నది.