కేరళ సీఎంకు జెడ్ ప్లస్ భద్రత

తిరువనంతపురం(కేరళ), జనవరి 4: కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్‌కు జడ్ ప్లస్ భద్రతను కల్పించారు. శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానంలోకి కేరళకు చెందిన కనకదుర్గ, బిందు అనే  ఇరువులు మహిళలు ప్రవేశించి స్వామి దర్శనం చేసుకోవడంతో కేరళలో పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. అయ్యప్ప భక్తులు, కాంగ్రెస్,  బిజెపి కార్యకర్తలు ఈ ఆందోళనలు చేపడుతున్నారు.  ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.

కేరళ సీఎం విజయన్ పర్యటించే ప్రాంతాల్లో అదనపు భద్రతతోపాటుగా ట్రాఫిక్ ఆంక్షలను కూడా చేపట్టనున్నట్లు  రాష్ర్ట పోలీసు నిఘా విభాగాధిపతి టి.కె వినోద్‌కుమార్ తెలిపారు.

కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం విజయన్ కాన్వాయ్‌లోని పైలెట్ కారును గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి అడ్డుకోవడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

అల్లర్లకు కారణంగా భావిస్తున్న 109 మంది సంఘ్ పరివార్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.